రివ్యూ : సేవకుడు

రివ్యూ : సేవకుడు 

‘సేవకుడు’… ఇదో టైపు పనిష్మెంటు

Sevakudu Movie review

నటీనటులు : శ్రీకాంత్‌, చార్మీ, కృష్ణ, మంజుల, నాజర్‌ తదితరులు
సంగీతం : శ్రీకాంత్‌ దేవా
నిర్మాత : ముత్తినేని సత్యనారాయణ
దర్శకత్వం : వి.సముద్ర

Sevakudu Movie review 1‘ఒకే ఒక్కడు’ ప్రభావం నుంచి మన దర్శకులు ఇంకా బయటపడలేదు. అలాంటి లైనే పట్టుకొని సముద్రం ఈదేద్దాం అని రంగంలోకి దిగుతున్నారు. తీరా చూస్తే ఒడ్డు దగ్గరే మునిగిపోతున్నారు. దర్శకుడు సముద్ర మనసుని కూడా ఈ సినిమా పూర్తిగా ఆక్రమించేసుకుని ఉంటుంది. అందుకే సముద్ర కూడా ఈ సముద్రంలోకి దిగిపోయారు. ఇది వరకే ‘అధినేత’, ‘ఎవడైతే నాకేంటి’ సినిమాల్ని వదిలారు. ఇప్పుడు… ‘సేవకుడు’ని రంగంలోకి దింపారు. కలలో కూడా ఊహించని అద్భుతాలు… ఆయన తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అద్భుతాలు అన్నామని.. ఏదో ఊహించుకొని థియేటర్లకు వెళ్లే ముందు అసలు ఈ సినిమాలో ఏముందో ఒక్కసారి తెలుసుకొందాం…

Sevakudu Movie reviewహెడ్ కానిస్టేబుల్ (నాజర్) తనయుడు సూర్య (శ్రీకాంత్). తండ్రికి వృత్తే దైవం. పోలీస్ స్టేషన్ దేవాలయం. కొడుకుని కూడా ఓ పోలీస్ అధికారిగా చూడాలనుకుంటాడు. సూర్యకేమో ఆ ధ్యాస ఉండదు. పోలీసుల్లో నిజాయితీపరులు ఉండరని, కష్టపడి పనిచేసినా గుర్తింపు దక్కదని, ఎంతటివాడైనా సరే లంచాలకు అలవాటు పడాల్సిందే అని వాదిస్తాడు. మరోవైపు లక్ష్మీ కృష్ణప్రసాద్ (కృష్ణ) అమెరికా నుంచి దిగుతాడు. తనకేమో మాతృదేశం అంటే మమకారం. అందుకే ఇక్కడ విద్యా సంస్థలు, వైద్య కళాశాలలూ స్థాపించి ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనుకుంటాడు. విజయవాడ నగరాన్ని గోల్డెన్ సిటీగా మారుస్తానని… ముఖ్యమంత్రికి మాటిస్తాడు. లక్ష్మీ ప్రసాద్ వల్ల తన వ్యాపారాలకు ఆటంకం వస్తోందని బలరామ్ (ప్రదీప్ రావత్) అతన్ని తెలివిగా హత్య చేస్తాడు. ఈ దుర్ఘటనలో సూర్య తన తండ్రిని కోల్పోతాడు. విషపూర్తితమైన ఈ వ్యవస్థను మార్చడానికి ఓ నిర్ణయానికి వస్తాడు. అదేంటి? దాని వల్ల విజయవాడలో ఎలాంటి పరిణామాలు సంభవించాయి? లక్ష్మీ కృష్ణ ప్రసాద్ ఆశయం నెరవేరిందా? లేదా? అనేదే ఈ ‘సేవకుడు’ స్టోరీ.

Sevakudu Movie review 3ముందే చెప్పుకొన్నట్టు ‘సేవకుడు’పై చాలా సినిమాల ప్రభావం ఉంది. ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’, ‘లీడర్’.. ఇలాంటి సినిమాల్ని చూసి ఇంకా ఏదో చెప్పాలన్న తపనతో రాసుకొన్న కథలా అనిపిస్తుంది. ఒక అంశాన్ని సమర్థంగా చెప్పాలంటే బలమైన సన్నివేశాలు రాసుకోవాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే కుదరదు. సరిగ్గా సముద్ర ఇక్కడే ఊబిలో కాలేశాడు. సన్నివేశాలకు అనవసర బిల్డప్పులు ఇచ్చుకొంటూ వచ్చాడు గానీ… వాటిని శక్తివంతంగా తీర్చిదిద్దడంలో ఘోరంగా విఫలమయ్యాడు. పైగా ఈ కథ లాజిక్ కి ఏమాత్రం అందదు. విజయవాడ సిటీని దత్తత తీసుకోవడం వరకూ ఒకే. లా అండ్ ఆర్డర్ కూడా ప్రభుత్వం.. మరొకరి చేతుల్లో అప్పనంగా పెడుతుందా? వాళ్లేమో ఇష్టం వచ్చినట్టు రౌడీ మూకల్ని కాల్చుకుంటూ వెళ్లిపోతారా? చాలా సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఊదాహరణకు ఒకటి వదులుతాం… కాచుకోండి. విలన్ ప్రదీప్ రావత్ కి ఉరిశిక్ష విధిస్తారు. శిక్ష అమలు జరుపుతారు కూడా. అయితే ఉరి తీశాక కూడా బతుకుతాడు. ‘దోషిని దేవుడే రక్షించాడు. అందుకే వదిలి పెట్టండి’ అని కోర్టు తీర్పు ఇస్తుంది. అతను దర్జాగా బయటికి వస్తాడు? సముద్ర ఈ సన్నివేశాన్ని మాంఛి నిద్రమత్తులోఉండి రాసుకొన్నాడేమో? ఇదొక్కటే కాదు… ఇలాంటి అద్భుతాలు ఇందులో కోకొల్లలు.

Sevakudu Movie review 2దర్శకుడికి ఈ సమాజంపై చాలా కసి, కోపం ఉన్నట్టు అర్థమవుతుంది. కానీ అదెలా ప్రెజెంట్ చేయాలో అర్థం కాక… వాటిని ప్రేక్షకులపై చూపించే ప్రయత్నం చేశాడు. తెరపై మనకు సంబంధం లేని విషయాలు చకచకా సాగిపోతుంటాయి. దాంతో ఆవలింతలతో కూడిన అసహనం మొదలవుతుంది. కమ్మగా నిద్ర పట్టేసేదే. అయితే సంగీత దర్శకుడి దారుణమైన ఆర్.ఆర్ కి ఆ మత్తు వదిలిపోయింది. చాలా సంభాషణలు వినిపించవు. అవి సెన్సార్ కట్ లో కలిసిపోయాయో లేదంటే.. ఆర్.ఆర్. మింగేసిందో అర్థంకాదు. ఓ సుదీర్ఘమైన సన్నివేశంలో శ్రీకాంత్ పేద్ద డైలాగ్ పలుకుతాడు. అప్పుడు లిప్ సింక్ అస్సలు కుదర్లేదు. అరబ్బీ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసినట్టు అనిపించింది. శ్రీకాంత్ ఇలాంటి కథల్ని ఎందుకు ఎంచుకొంటున్నాడో అర్థం కావడం లేదు. నటనాపరంగా ఈ సినిమాతో అతనికి ఒరిగిందేమీ లేదు. కొన్నిచోట్ల ఓవర్ యాక్షన్ చేశాడు. ఛార్మి నస పెట్టలేదు. ఎందుకంటే ఆమెకు ఆ ఛాన్స్ ఎక్కడిది? జస్ట్.. పాటల పాత్ర… శుద్ధ దండగ. బ్రహ్మానందంలాంటి ఉద్దండుడిని పెట్టుకొని కూడా నవ్వులు పిండుకోలేక పోయారంటే అది దర్శకుడి, రచయిత అసమర్థత వల్లే.

Sevakudu Movie review 4నేరం చేసినవాడిని అప్పటికప్పుడు శిక్షించాలి అనేది.. ఈ సినిమా కాన్సెప్టు. నో ఎఫ్.ఐ.ఆర్, నో ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ పనిష్మెంట్ అనేది ఈ సినిమా స్లోగన్. సముద్ర కూడా అదే చేశాడు. టికెట్ కొని థియేటర్ లోకి అడుగుపెట్టిన పాపానికి రెండున్నర గంటల శిక్ష విధించేశాడు.

 

తెలుగుమిర్చి రేటింగ్‌ :  2/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.