Site icon TeluguMirchi.com

శ్రీ‌హ‌రి.. కాస్త చూసుకో మ‌రి!!

srihariఅంచెలంచెలుగా ఒకొక్క మెట్టూ ఎక్కుతూ చిత్రప‌రిశ్రమ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకొన్న న‌టుడు శ్రీ‌హ‌రి. ప్రతినాయ‌కుడిగా అడుగుపెట్టి.. త‌న కండకావరంతో ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఫైట్స్‌లో రియాలిటీ ప‌రిశ్రమ‌కు బాగా న‌చ్చింది. దాంతో హీరోని చేశారు. అక్కడా త‌న ప్రతాపం చూపించాడు. సాంబ‌య్య, పోలీస్‌, భ‌ద్రాచ‌లం…. ఇలా శ్రీ‌హ‌రి సినిమాల్నీ హిట్ బాట న‌డిచాయి. ఆ హ‌వా కొంత‌కాలం సాగింది. ఆ త‌ర‌వాత‌… క్యారెక్టర్ న‌టుడిగా ట‌ర్న్ తీసుకొన్నారు. సినిమాకి ఆయువు ప‌ట్టులాంటి పాత్ర పోషించి భ‌ళా అనిపించుకొన్నారు. కొన్ని పెద్ద సినిమాలు కేవ‌లం శ్రీ‌హ‌రి ప్రతిభ వ‌ల్లే ఆడాయి… అన‌డంలో ఎటువంటి అతిశ‌యెక్తి లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటాటా, మ‌హానంది, ఢీ, కింగ్‌, డాన్ శీను… ఇవ‌న్నీ శ్రీ‌హ‌రి ప్రత్యేక‌త‌ను చాటిన సినిమాలు. మ‌గ‌ధీర గురించి చెప్పక్కర్లేదు. షేర్‌ఖాన్‌గా చెల‌రేగిపోయారు.

అయితే అదంతా గ‌తం. ఇప్పుడు ఆరేంజు పాత్రల్లో శ్రీ‌హ‌రి క‌నిపించి చాలా కాలం అయ్యింది. శ్రీ‌హ‌రి.. పాత్రల్లో ప్రత్యేక‌త పోయి… ఓ మొనాలిటీ వ‌చ్చేసింది. ఎప్పుడు చూసినా అవే అరుపులూ, అదే మేన‌రిజం. ఇటీవ‌ల శ్రీ‌హ‌రి లెక్కకు మించిన సినిమాల్లో క‌నిపించారు. అయితే ఒక్కటీ ప్రేక్షకుల‌కు గుర్తు లేదు. ఒక్క సినిమా కూడా బాక్సాఫీసు ద‌గ్గర నిల‌దొక్కుకోలేదు. కో అంటే కోటి, జ‌బ‌ర్‌ద‌స్త్‌, బ‌క‌రా సినిమాల్లో ఆయ‌న‌వి మ‌రీ బ‌క‌రా వేషాలు. ఉగాదికి వచ్చిన వ‌సూల్ రాజా… కూడా దారుణంగా డింకీ కొట్టింది. అంత‌కు ముందు కూడా ఆయ‌న్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. సోలో హీరోగా ఎప్పుడో దూర‌మైపోయారు. ఇప్పుడాయ‌న ప‌రిస్థితి అటు హీరోగానూ, ఇటు అతిథి పాత్రల‌కూ కాకుండా పోయింది. రెండు చోట్లా.. ఎదురు దెబ్బలు త‌గులుతున్నాయి. పాత్రపై కంటే పారితోషికంపైనే ఎక్కువ మ‌క్కువ చూపుతున్నందు వ‌ల్ల…. ఆయ‌న కెరీర్ మ‌రీ మ‌స‌క‌బారిపోయే ప్రమాదంలో ప‌డింది. చేతికి అందిన ప్రతి సినిమా ఒప్పుకోవ‌డం వ‌ల్ల… ఏ పాత్రకూ న్యాయం చేయ‌లేక‌పోతున్నార‌ని మ‌రి కొంత‌మంది వాద‌న‌. ఇప్పటికైనా తాను ఒప్పుకొంటున్న సినిమాల గురించి ఓసారి శ్రీ‌హ‌రి స‌మీక్షించుకొంటే మంచిది. త్వర‌లో తుఫాన్‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్నాడు. మ‌గ‌ధీర మ్యాజిక్ ఇక్కడా వ‌ర్కవుట్ అయితే.. శ్రీ‌హ‌రి కెరీర్ మ‌రోసారి స్పీడందుకోవ‌డం ఖాయం.

Exit mobile version