Site icon TeluguMirchi.com

అభిమానుల తాకిడికి రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ కి అంత‌రాయం

ramcharan-shooting

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. విల‌క్ష‌ణ చిత్రాల దర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, మోహ‌న్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుగుతోంది.

ఈ సంద‌ర్భంగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ, ` `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది అంటే కార‌ణం ప్రేక్ష‌కాభిమానులే. 100 రోజులు సినిమా ఆడ‌టం అనేది ఎప్పుడో పోయింది. కానీ `ఖైదీ నంబ‌ర్ 150`వ సినిమా 100 రో జులు ఆడింది. అది మీవ‌ల్లే. నాన్న‌గారి 151వ సినిమా ఆగ‌స్టులో ప్రారంభం అవుతుంది. ఇంత వ‌రకూ ఆయ‌న ఇలాంటి పాత్ర‌లో క‌నిపించ‌లేదు. ఓ గొప్ప పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జ‌ర‌గ‌నుంది. క‌చ్ఛితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది. అలాగే నా `ధృవ` సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అప్పుడు దేశం డీమానిటైజేష‌న్ స‌మ‌స్య‌ లో ఉంది. అలాంటి స‌మ‌యంలో కూడా భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి అంటే కార‌ణం అభిమానులే. అందుకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న స‌మ్మ‌ర్ ను సైతం లెక్క చేయ‌కుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నారు. అందుకు ఆయ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. బాబాయ్ ఏ కార్య‌క్ర‌మం చేసినా ఆయ‌న వెన్నంటే ఉండాలి. రాజ‌కీయ ప‌రంగానైనా..ఇంకేదైనా. భార‌త‌దేశంలో మెగా అభిమానులంతా భారీ ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. మేము ఇంత ఎత్తుకు ఎదిగామంటే కార‌ణం మీరే. నేను హైద‌రాబాద్ లో ఉండి సినిమా షూటింగ్ చేసుకోవ‌చ్చు. కానీ మిమ్మ‌ల్ని అల‌రించాలనే క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదురైనా సినిమా షూటింగ్ కోసం నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నాం. నా సినిమా విష‌యానికి వ‌స్తే .. సుకుమార్ చాలా మంచి క‌థ చెప్పారు. క‌థ‌, క‌థ‌నాలు చాలా డిఫ‌రెంట్ గా ఉన్నాయి. అందుకే సినిమాకు క‌మిట్ అయ్యా. మీ అంద‌ర్నీ అల‌రించే విధంగా సినిమా ఉంటుంది` అని అన్నారు.

మెగాఫ్యాన్స్ జాతీయ అధ్య‌క్షుడు ర‌మ‌ణం స్వామినాయుడు మాట్లాడుతూ, `-గ‌త 26 రోజులు నుంచి పోల‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో, అన‌గా కొత్తూరు, టేకూరు మ‌రియు గిరిజన ప్రాంతాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ సినిమా షూటింగ్ జ‌ర‌గ‌ని ప్ర‌దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. హైద‌రాబాద్ కంటే భారీ ఉష్ణోగ్ర‌త‌లు న‌మొద‌య్యే ప్రాంతాల‌లో వేడిమిని త‌ట్టుకుని చిత్ర యూనిట్ షూటింగ్ చే్స్తున్నారు. అదే విధంగా అక్క‌డ ఉన్న అద్భుత‌మైన అందాల న‌డుమ షూటింగ్ చేస్తున్నారు. క‌థ‌కు సంబంధించిన పురాతన‌మైన గ్రామాలు దొర‌క‌డం వ‌ల్ల సుకుమార్ ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. అందుకు హీరో రామ్ చ‌ర‌ణ్ ఏ మాత్రం కాద‌న‌కుండా ఎంత క‌ష్ట‌మైనా చేద్దామ‌ని టీమంతా క‌లిసి ఇక్క‌డే షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి సెల్ ఫోన్లు ప‌నిచేయ‌వు. మ‌ధ్య‌లో రెండు రోజులు కొల్లేరు ప్రాంతంలో షూటింగ్ జ‌రిపారు. ఈ ప్రాంతంలో షూటింగ్ స‌మ‌యంలో భారీగా వీరాభిమానులు త‌ర‌లి రావ‌డం వ‌ల్ల వాళ్ల ధాటికి త‌ట్టుకోలేక షూటింగ్ క్యాన్సిల్ చేశారు. త‌ర్వాత కొత్తూరు లో నిన్న‌టి రోజున (ఆదివారం 23వ తేదీన‌) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో కూడా అభిమానుల తాకిడి ఎక్కువ కావ‌డంతో షూటింగ్ ర‌ద్దు చేశారు. రోజు రోజుకి మారుమూల గ్రామాల నుంచి అభిమానులు భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్నారు. షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చిన ఓ అభిమాని కుటుంబం త‌మ బాబుకి కిడ్నీ సంబంధింత వ్యాదితో బాధ ప‌డుతుంటే, ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా స‌రైన వైద్యం కుద‌ర‌కపోవ‌డంతో స్వ‌యంగా హీరో చ‌ర‌ణ్ వైద్య స‌దుపాయాలు క‌ల్పించారు. అలాగే షూటింగ్ చూడ‌టానికి వ‌చ్చిన అభిమానులంద‌రికీ ఆయ‌న భోజ‌న వ‌స‌తులు క‌ల్పించారు. వారం రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల‌కు కొత్త అధ్య‌క్షుల‌ను కె. నాగేంద్ర‌బాబు నియ‌మించారు. ఏపీ అధ్య‌క్షుడిగా కె. రామ‌కృష్ణ (త‌ణుకు), తెలంగాణ రాష్ర్ట అధ్య‌క్షుడిగా ఏ.నంద‌కిషోర్ (సూర్యాపేట‌) ఎంపిక‌య్యారు. వారిద్ద‌ర్నీ అశేష అభిమానుల స‌మ‌క్షంలో చ‌ర‌ణ్ ప్ర‌తిపాదించి అభినందించారు` అని తెలిపారు.

Exit mobile version