‘అవార్డు ప్రజెంటర్’ గా మెగాపవర్ స్టార్..


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆస్కార్స్ ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా రామచరణ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో అవార్డు ప్రజెంటర్ గా గౌరవం దక్కించుకున్నారు. బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును అందచేసిన రామ్ చరణ్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గుడ్‌ మార్నింగ్‌ అమెరికా షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశం తరుపున ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి నటుడు రామ్‌చరణే కావడం విశేషం.

ఇకపోతే ఇప్పటికే ‘RRR’ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో నాలుగు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. అలాగే స్పాట్ లైట్ అవార్డ్ కూడా RRR కే దక్కింది.