Site icon TeluguMirchi.com

వ‌ర్మ ఇంకెప్పుడు బాగు ప‌డ‌తాడో…?

varmaచెట్టు పేరు చెప్పి కాయ‌లు అమ్ముకోవ‌డం వ‌ర్మకు స్ర్కీన్‌తో పెట్టిన విద్య‌. శివ అనే ఒకే సినిమా అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సినిమాలు తీసేస్తున్నాడు. మ‌ధ్య మ‌ధ్యలో స‌త్యలాంటి మెరుపులు రాక‌పోతాయా..? అనేది ఆయ‌న అభిమానుల ఆశ‌. సినిమా తీయ‌డం ఆయ‌న ఇష్టం. ఎలాంటి సినిమా తీయాలో అదీ ఆయ‌న ఇష్టమే. ప్రతీ సినిమా శివ కావాల‌నే రూలేముంది..? కాక‌పోతే సినిమాని అమ్ముకోవ‌డానికి ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం మాత్రం వ‌ర్మ దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శనంగా మారింది. శివ‌2, స‌త్య‌2 సినిమాలు తీసి త‌న‌కున్న పేరు, ఆ సినిమాపై ఉన్న గౌర‌వం రెండూ పోగొట్టుకొన్నాడు వ‌ర్మ‌. అదేంటి అని ఆయ‌న్ని అభిమానంగా అడిగినా? నేనేమైనా మిమ్మ‌ల్ని సినిమా చూడ‌మ‌న్నానా?? అని పేద్ధ లాజిక్‌గా మాట్లాడ‌తాడు.

నిజానికి వ‌ర్మని బ‌తికిస్తున్నవి అత‌ని మాట‌లే. న‌లుగురూ ఒక‌టి మాట్లాడితే వ‌ర్మ మ‌రోలా మాట్లాడ‌తాడు. ఎవ‌రూ మాట్లాడ‌నిది వ‌ర్మ మాట్లాడ‌తాడ‌ని.. వ‌ర్మ ఏం చెప్పినా జ‌నం ఆస‌క్తిగా వింటారు. ఆన‌క‌… న‌వ్వుకొని వెళ్లిపోతారు. వ‌ర్మ కూడా అంతే. వెర్రిబాగుల‌వాళ్లు, నే చెప్పింది వినేవాళ్లు చాలామంది ఉన్నారు క‌దా.. అని నోటికొచ్చింది మాట్లాడేస్తుంటాడు. రాత్రి అనుకొంటే పొద్దుట సినిమాగా తీసేస్తా.. అంటూ ఓ కొత్త నిర్వచ‌నం ఒక‌టి చెప్పాడామ‌ధ్య‌. నిద్ర క‌ళ్లతో తీస్తాడు కాబ‌ట్టే, అత‌ని సినిమాలు అలా త‌యార‌వుతున్నాయి. నిజం చెప్పాలంటే వ‌ర్మ మాట‌లు .. మాట‌ల‌కూ ప‌రిమితం. నిజంగా అవి ఆచరిస్తాడా?? అంటే అదేం ఉండదు. త‌న కుటుంబంతో డిటాచ్‌డ్‌గా ఉంటాన‌ని, అస‌లు కూతురు ఏం చ‌దువుతుందో తెలీద‌ని గొప్పగా చెప్పుకొనే వ‌ర్మ‌, ఆ కూతురి పెళ్లి ద‌గ్గరుండి చేశాడు. అల్లుడికి కాళ్లు కూడా క‌డిగాడ‌ట‌. మీడియా కంట ప‌డ‌కూడ‌ద‌ని, ఆ పెళ్లికి మీడియాకు ఆహ్వానం పంప‌లేదు.

ఇప్పుడు స‌త్య 2 సినిమా చూస్తే వ‌ర్మపై జాలేస్తుంది. వ‌ర్మలో లేనిది టాలెంటో, మ‌రోక‌టో కాదు. క‌డుపు నిండిన‌త‌నం. త‌న‌మీద త‌న‌కు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్. కోటి రూపాయ‌ల్లో సినిమా తీసి ప‌ది కోట్లకు అమ్ముకోవ‌డ‌మే తెలిసిన వ్యక్తి. అందుకే వ్యాపారినికి అల‌వాటు ప‌డి… త‌న‌లోని సృజ‌నాత్మక‌త‌ను పాడుచేసుకొన్నాడు. ఇప్పుడు వ‌ర్మలో ద‌ర్శకుడు లేడు. నిర్మాత మాత్రమే ఉన్నాడు. లేదంటే సత్య 2 కోసం ధ‌న‌ల‌క్ష్మిపైకేసు వేస్తాన‌న‌డం ఏంటి?? సినిమా వ‌చ్చింది, ఫ్లాప్ టాక్ తెచ్చుకొంది. పాత వ‌ర్మ అయితే.. ఎప్పట్లా దులుపుకొని త‌ర‌వాత సినిమా పనిలో ప‌డిపోదును. కానీ ఇప్పుడు కొత్త వ‌ర్మ బ‌య‌ల్దేరాడు. అత‌ను నిర్మాత కోణంలోంచి ఆలోచించాడు. నా సినిమాకి జ‌రిగిన న‌ష్టానికి నువ్వే బాధ్యురాలివి… అంటూ ధ‌న‌ల‌క్ష్మిపై కేసు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇదంతా ప‌బ్లిసిటీ కోస‌మే అని అంద‌రికీ తెలుసు. ఇంత‌కాలం ఇలాంటి జిమ్మిక్కులు వర్మ త‌న సినిమాకి ముందే చేసేవాడు. ఇప్పుడు ఆఫ్టర్‌రిలీజ్ కూడా మొద‌లెట్టేశాడ‌న్నమాట‌.

వ‌ర్మ ఇక మార‌డా?? వ‌ర్మ ఎప్పుడూ ఇలానే ఆలోచిస్తాడా?? ఈ తెలివి తేట‌లేవో క‌థ‌లు రాసుకోవ‌డంలో వాటిని తీయ‌డంలో చూపించొచ్చు క‌దా..? వ‌ర్మ సాంకేతికంగా గొప్పోడు. సినిమాని టెక్నిక‌ల్‌గా తీయ‌డంలో దిట్ట‌. కానీ… ఇప్పటి ప్రేక్షకుడికి అవ‌న్నీ ఎందుకు?? సినిమాని ఏ కెమెరా ఉప‌యోగించి తీస్తే ఏంటి? బాగుందా? లేదా? అనే ఆలోచిస్తాడు. త‌న పాత‌సినిమాల్ని ప‌ని గ‌ట్టుకొని మ‌రీ సీక్వెల్‌లు తీసి వాటి పేరుని పాడు చేస్తున్నాడు. తాను మాత్రం బాగానే సొమ్ము వెన‌కేసుకొంటున్నాడు. నాలుగు డ‌బ్బులొస్తే చాలు, అని ఆలోచిస్తున్నాడు. వ‌ర్మని జ‌నాలు ఎప్పుడో న‌మ్మడం మానేశారు. మీడియా కూడా వ‌ర్మని లైట్ తీస్కోంటోంది. ఇది వ‌ర‌కు వ‌ర్మ క‌నిపిస్తే ఇంటర్వ్యూలు అంటూ వెంట‌ప‌డే మీడియా, ఇప్పుడు వ‌ర్మ పిలిచి ఇంట‌ర్వూలు ఇస్తాన‌న్నా… త‌ర‌వాత చూద్దాంలే అని ప‌క్కకు వెళ్లిపోతోంది.
ఎంత మార్పు..?

కింగ్‌లా బ‌తికిన వ‌ర్మ‌… ఇప్పుడు జోక‌ర్‌లా మారిపోవ‌డం విధి వైచిత్రి కాదు. వ‌ర్మ స్వయంకృతాప‌ర‌థం. దీన్నించి వ‌ర్మ ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడు? అస‌లు వ‌ర్మ మార‌తాడా? లేదా? ఇవ‌న్నీ స‌మాధానం లేని ప్ర‌శ్నలు. అయినా ఇవ‌న్నీ కొన్ని రోజులే. వ‌ర్మ నుంచి మ‌రో సినిమా వ‌స్తోందంటే అంద‌రూ ఎలెర్ట్ అయిపోతాం..? ఏ హాల్లో విడుద‌ల చేస్తున్నారు? ఏ షోకి వెళదాం? అంటూ
ఆత్రుత ప‌డ‌తారు.. ఆ సినిమా అయిపోగానే మ‌ళ్లీ మ‌న క‌థ మామూలే. అటు వ‌ర్మా మామూలే! భూమి గుండ్రంగా ఉంటుంది బ్రద‌ర్‌… ప్రేక్షకుడూ – వ‌ర్మ అంతే! ఎక్కడ ఆగారో, మ‌ళ్లీ అక్కడే క‌లుసుకొంటారు…!

Exit mobile version