నేడు పెరిగిన సాంకేతికత వల్ల ఎంతటి భారీ చిత్రాన్ని అయినా తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. భారీగా సాంకేతికతను వాడితే భారీ కలెక్షన్లు కూడా వస్తాయని ‘బాహుబలి’ చిత్రం నిరూపించింది. దాంతో ఎన్ని కోట్లయినా పెట్టుబడిగా పెట్టి భారీ చిత్రాలను తెరకెక్కిస్తే మంచి పేరు వస్తుంది అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు కానీ అది అందరికి సాద్యం కాదు అనేది జగమెరిగిన సత్యం. ‘బాహుబలి’ విజయాన్ని చూసో లేక తనకే ఆలోచన పుట్టిందో కానీ నిర్మాత అల్లు అరవింద్ త్వరలో 500కోట్లతో ‘రామాయాణం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని ప్రకటించాడు. అంతేకాకుండా ‘మహాభారతం’ను కూడా తెరకెక్కించడానికి పలువురు చర్చలు జరుపుతున్నారు.
బడా నిర్మాత అల్లు అరవింద్ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ‘రామాయణం’ను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఎలాగు అల్లు అరవింద్ నిర్మాణం, అంత గొప్ప చిత్రం కాబట్టి కచ్చితంగా ఈ చిత్రంలో మెగా వారసులు ఉంటారు అని ఫ్యాన్స్ పసిగట్టేశారు. అందుకే అమితానందంతో ఎవరో అభిమాని ఏకంగా రాముని రూపంలో ఉన్న చరణ్ స్టిల్‌ను తయారు చేశాడు. ఆ ఫొటో మూడు రోజులు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. అయితే ఆ ఫొటోపై మెగా కాంపైండ్ నుండి అది కేవలం పుకారే అనే టాక్ వినిపించింది. కానీ ఎవ్వరు కూడా అధికారికంగా చరణ్ ‘రామాయణం’లో నటించడం లేదు అని చెప్పలేదు. కాబట్టి ‘రామాయణం’ రామ్ చరణ్ నటించడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఏ పాత్రలో అనేది అందరికి ఆసక్తిగానే ఉంది.