దర్శకధీరుడి అలక !

Rajamouliదర్శకధీరుడు రాజమౌళి వాలకం చూస్తోంటే అలిగినట్టే కనిపిస్తున్నాడు. సాధారణంగా జాతీయస్థాయిలో అవార్డు వచ్చిందంటే సినీపరిశ్రమకు సంబంధించిన వారెవరైనా సరే ఎగిరి గంతేస్తారు. అందునా ఓ ప్రాంతీయ భాషకు చెందినవారిని జాతీయ పురస్కారం వరించిందంటే ఇక వారి ఆనందానికి ఆకాశమే హద్దు అవుతుంది. కానీ కొన్ని రోజుల క్రితం ప్రకటించిన జాతీయ అవార్డుల జాబితాలో ఏకంగా రెండు అవార్డులు సొంతం చేసుకున్న మన తెలుగు ‘ఈగ’ సృష్టికర్త రాజమౌళి మాత్రం తనకీ అవార్డులపై పెద్దగా మోజు లేదంటున్నాడు. అంతేకాదు … ఈగలో ప్రతినాయకుడిగా అద్భుతమైన నటన కనబరచి అంతర్జాతీయ స్థాయి దర్శకుడు శేఖర్‌ కపూర్‌ మన్ననలు సైతం అందుకున్న నటుడు సుదీప్‌ కు, ఈగ చిత్రంలో అద్భుతమైన కెమెరా వర్క్‌ కనబరచిన సెంథిల్‌ కు కూడా అవార్డులు వచ్చుండాల్సింది అంటూ చెప్పుకొస్తున్నాడు. పనిలో పనిగా ఈ విభాగాలను జ్యూరీ ఎందుకు పరిశీలించలేదు అని అడుగుతూనే మెల్లగా వారిని తాను తప్పు పట్టడంలేదంటూ తప్పుకున్నాడు. ఏమో జాతీయ అవార్డుల జాబితా ప్రకటించినప్పటినుండీ జక్కన్న అలక పానుపు ఎక్కినట్టుగానే మాట్లాడుతున్నాడు. అది కేవలం తానాశించిన వారికి అవార్డు దక్కలేదనేనా… లేక తనకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు దక్కలేదనా అంటూ ఇండస్ట్రీలో కొందరు తమను తామే ప్రశ్నంచుకుంటున్నారు.