టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం కోసం గత అయిదు సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్న విషయం తెల్సిందే. ఈనెల 28న ‘బాహుబలి’ రెండవ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత నెల రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత తన తదుపరి సినిమా గురించి ఒక నిర్ణయం తీసుకోనున్నాడు. ‘బాహుబలి’ ప్రారంభించినప్పటి నుండి కూడా తర్వాత సినిమా ఏంటి అంటూ ఎంతో మంది జక్కన్నను అడిగారు. అయితే బాహుబలి తప్ప తన మనసులో మరే సినిమా లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా బాలీవుడ్లో ఒక సినిమా చేసేందుకు జక్కన్న ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.
రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు బాలీవుడ్లో మంచి పేరుంది. సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం భజరంగీ బాయిజాన్కు విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన విషయం తెల్సిందే. అందుకే సల్మాన్ ఖాన్‌కు విజయేంద్ర ప్రసాద్ అంటే ప్రత్యేకమైన గౌరవం. ఆ గౌరవంతోనే విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసిన మరో కథకు సల్మాన్ ఖాన్ ఓకే చెప్పాడు. ఆ కథను రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. బాలీవుడ్ కండల వీరుడితో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ జక్కన్న దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నారు.