మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు అన్ని దక్షిణాది భాషల్లో తన హవా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 25 ఏళ్ల ప్రియా, బికామ్ పూర్తి చేసిన తర్వాత సినిమాలపై ఉన్న మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేసింది. ఆమె తొలి ప్రయత్నం 2018లో ‘తానాగా’ అనే మలయాళ సినిమాలో బస్‌స్టాండ్‌లో ఉన్న అమ్మాయి పాత్రతో మొదలైంది. అయితే ఆమె అసలైన గుర్తింపు మాత్రం 2019లో వచ్చిన ‘ఒరు అడర్ లవ్’ సినిమా ద్వారానే వచ్చింది. ఈ చిత్రంలోని “కన్ను గీటే” సన్నివేశం ఆమెను ఒక్కరాత్రిలోనే నేషనల్ సెన్సేషన్‌గా మార్చింది. ఈ గుర్తింపుతో ఆమె తెలుగులోనూ అవకాశాలు అందుకుంది. ‘చెక్’, ‘ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా సరే, ప్రియా వారియర్ క్రమంగా తన క్రేజ్‌ను కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ, ఈ ఏడాది తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ధనుష్ దర్శకత్వం వహించిన ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోపం’ అనే సినిమాలో ప్రీతిగా నటించింది. ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ పొందినప్పటికీ, ఆమె నటనకి మంచి ప్రశంసలు లభించాయి.
తాజాగా విడుదలైన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే తమిళ చిత్రం ద్వారా ఆమె మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో అర్జున్ దాస్‌కు ప్రియురాలిగా నటించిన ఆమె, ‘తొట్టు తొట్టు పేసుమ్ సుల్తానా’ పాటలో చేసిన డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ పాటలో ప్రియా వారియర్ నృత్యం మరోసారి ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ తీసుకొచ్చింది. ఇక తాజాగా ప్రియా మాట్లాడుతూ తల అజిత్ గురించి చెప్పిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ప్రియా తెలిపిన వివరాల ప్రకారం అజిత్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నాడని అన్నారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ “మీ దగ్గర అజిత్ సార్ నంబర్ ఉందా?” అంటే, “అవును ఉంది” అని చెప్పడమే కాక, “ఆయన వాట్సాప్ డీపీ ఏంటి?” అని అడిగితే, “ఆయన తన కార్ రేసింగ్ ఫోటోనే డీపీగా పెట్టుకున్నారు” అని తెలిపారు.