Salaar Movie Review Rating
TELUGUMIRCHI.COM RATING : 3.5/5
ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సీజ్ ఫైర్ కోసం మూవీ లవర్స్ అంతా సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సలార్ సీజ్ ఫైర్ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ పై క్రియేట్ అయిన అంచనాలని సలార్ సీజ్ ఫైర్ సినిమా ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ:
అమెరికాలోని పుట్టి పెరిగిన ఆద్య (శ్రుతి హాసన్) తన తండ్రికి తెలియకుండా ఇండియా వస్తుంది. ఇండియా వచ్చిన ఆధ్యకి త్రెట్ ఉండడంతో ఆమె ప్రాణాలని కాపాడానికి అస్సాం బర్మా బోర్డర్ లో ఉన్న ఒక బొగ్గు గనిలో పనిచేసే దేవరథ అలియాస్ దేవ (ప్రభాస్) వద్దకు తీసుకువెళ్తారు. దేవా బొగ్గు గనుల్లో పని చేస్తుంటే.. అతని తల్లి (ఈశ్వరీ రావు) ఆ ఊరిలో పిల్లలకు పాఠాలు చెబుతుంది. తల్లి మాట దాటని కొడుకుగా ఉన్న దేవా.. ఆధ్యని ఎందుకు కాపాడాలి? అతనే ఆమెని కాపాడగలడు అని ఎందుకు నమ్ముతున్నారు? దేవా తల్లి కొడుకు చేతిలో ఒక ప్లాస్టిక్ కత్తి ఉన్నా ఎందుకు భయపడుతుంది? అనే ట్రావెల్ తో సలార్ కథ ఓపెన్ అయ్యి.. ఇక్కడి నుంచి ఖాన్సార్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఇక్కడ రాజమన్నార్ (జగపతి బాబు)ని ప్రెజెంట్ చేసి, అతను లేని సమయంలో యువరాజు వరద రాజమన్నార్ ని చంపే పథకం వేస్తారు కొందరు. ఇలాంటి సమయంలో వరద రాజమన్నార్ దేవా కోసం బర్మా వస్తాడు. అసలు దేవా ఎందుకు బర్మాలో ఉన్నాడు? దేవ-వరద రాజ్ మన్నార్.. ప్రాణ స్నేహితులు ఇద్దరూ బద్ద శత్రువులుగా ఎందుకు మారతారు? లాంటి విషయాలతో సలార్ సినిమా సాగింది.
విశ్లేషణ:
ప్రభాస్ లాంటి కటౌట్ కి పర్ఫెక్ట్ మాస్ సినిమా పడి చాలా కాలమే అయ్యింది. ఆ లోటుని తీరుస్తూ ప్రశాంత్ నీల్ తన మార్క్ ఎలివేషన్స్ తో సలార్ కథని రాసుకున్నాడు. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో కేవలం నాలుగు ఫైట్స్ మాత్రమే పెట్టి కూడా ఆడియన్స్ కి ఎక్కడా లాగ్ కనిపించకుండా చేసాడు ప్రశాంత్ నీల్. ఎలివేషన్స్ తో పాటు ఎమోషన్స్ ని కూడా సెట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసాడు. అయితే కథని చెప్పే విషయంలో ప్రశాంత్ నీల్ కాస్త తడబడినట్లు అనిపిస్తోంది. మొదటిభాగం పెద్దగా ముందుకి కదలకపోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉగ్రమ్ ఫస్ట్ హాఫ్ ని అలానే దించేసిన ప్రశాంత్ నీల్, సెకండ్ హాఫ్ ని బాగానే రాసుకున్నాడు. క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ ఏదైతే ట్విస్ట్ అనుకున్నాడో అది ముందుగానే ఊహించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఎక్కువ ప్రాంతాల పేర్లు, ఎక్కువ క్యారెక్టర్ల పేర్లు ఉండడంతో ఇది గుర్తు పెట్టుకోవడం, కథ ఏ ప్రాంతంలో జరుగుతుంది అనేది అర్ధం చేసుకోవడం కామన్ ఆడియన్స్ కి కాస్త కష్టమైన పనే. కథా కథనాల పైన కొంచెం కేర్ తీసుకుని ఉంటే సలార్ సినిమా డెఫినెట్ గా మరింత బాగుండేది.
ఎవరెలా చేసారంటే:
ప్రభాస్ పూర్తిగా వన్ మ్యాన్ షో చేసాడు. దేవరథ క్యారెక్టర్ కి ప్రభాస్ పర్ఫెక్ట్ యాప్ట్. ఎమోషన్స్ ని అండర్ ప్లే చేసే సమయంలో, కోపాన్ని చూపించే సమయంలో ప్రభాస్ కంప్లీట్ ఇంకో లెవల్ లో కనిపించాడు. సలార్ కోసం ప్రభాస్ బాడీ బిల్డ్ చేసాడు, ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిచడం గ్యారెంటీ. బాహుబలి ప్రభాస్ ని మరోసారి గుర్తు చేసేలా ఉన్నాడు ప్రభాస్. ఇక పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, సలార్ కొర్ ఎమోషన్ మొత్తం పృథ్వీరాజ్ చుట్టూనే తిరుగుతుంది. యువరాజుగా పృథ్వీరాజ్ చేసిన పెర్ఫార్మెన్స్ చూసాకా ఆ స్థానంలో ఇంకొకరిని ఊహించడం కూడా కష్టమే. ప్రభాస్-పృథ్వీరాజ్ లు తమ యాక్టింగ్ తో సినిమాని నడిపించారు. ఈ ఇద్దరి తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవడానికి పెద్ద క్యారెక్టర్స్ ఏమీ లేవు. ఈశ్వరి రావ్, శృతి హాసన్, మైమ్ గోపి, జగపతి బాబు, బాబీ సింహా, ఝాన్సీ, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, జాన్ విజయ్, బ్రహ్మాజీ, ఎంఎస్ చౌదరి, టినూ ఆనంద్.. ఇలా తెరపై కనిపించిన ప్రతి నటుడు, తమకిచ్చిన పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, సౌండ్ డిజైన్ అండ్ సెట్ డిజైన్.. ఇలా 24 క్రాఫ్ట్స్ కంప్లీట్ గా ప్రశాంత్ నీల్ ఫార్మాట్లోనే ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కి స్పెషల్ అప్లాజ్ ఇవ్వాల్సిందే. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త బెటర్ గా ఉండొచ్చేమో. ఎడిటింగ్ విషయంలో కూడా KGF స్టైల్ ఆఫ్ కట్స్ ని కాస్త తగ్గిస్తే ఇంకా బాగుండేది అనిపించింది.
ఫైనల్లీ: ‘సలార్’ కంప్లీట్ గా ప్రభాస్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ప్రశాంత్ నీల్ అలానే ప్రెజెంట్ చేసిన సినిమా.