ప్రముఖనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఓ టీవీ లైవ్ చర్చలో పాల్గొని వీరంగం చేసారు. సీమాంధ్ర ఉద్యమం కారణంగా పెద్ద సినిమాల విడుదలలో జాప్యం కారణంగా సినిమా పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్న శంపై ఆదివారం ఒక చానెల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. వందేళ్ళ సినిమా వేడుకలలో పాల్గొనే నిమిత్తం చెన్నై లో వున్న పోసాని అక్కడినుంచి లైవ్ లో ఈ చర్చలో పాల్గొన్నారు. అయితే పోసాని ఆసాంతం ఈ చర్చలో ఒక సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. ప్రతి ప్రశ్నకు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపైనే గురి పెడుతూ సమాధానాలు చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. ఆవుపాఠమ్ లాగా అన్ని ప్రశ్నలకు చంద్రబాబు చుట్టూనే ఆయన సమాధానాలు అల్లటం విశేషం. మధ్య మధ్యలో కాస్తో కూస్తో బ్యాలెన్స్ చేసుకోవటం కోసం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును ప్రస్తావించారు. సినిమాలను ఇబ్బందిపెడుతున్న ఉద్యమకారులు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబును ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇలా ఈ చర్చలో పలుసార్లు ఆయన చంద్రబాబు ను ఒక ప్రత్యర్ధి పార్టీ నాయకుడిలా ఉతికి ఆరేశారు.
మరో విచిత్రమేమిటంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు విడుదల కావటానికి చిరంజీవి రాజకీయాలు అడ్డంకి అయితే, జూనియర్ ఎన్ టి ఆర్ సినిమాకు చంద్రబాబు నాయుడు రాజకీయం అడ్డంకి అన్నట్టు పోసాని మాట్లాడటం విడ్డూరం. జూనియర్ ఎన్ టి ఆర్ సినిమాలకు ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే జూనియర్ తండ్రి హరికృష్ణ సమైక్యాంధ్ర కు అనుకూలంగానే తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేసి సీమాంధ్ర ప్రాంతం సానుకూలత ను సంపాదించుకున్నారు. ఉంటె గింటే జూనియర్ సినిమాకు తెలంగాణా లో ఇబ్బంది ఉండే అవకాశం వుంది. చంద్రబాబు రాజకీయాలకు , జూనియర్ సినిమాలపై వ్యతిరేక ప్రభావానికి ఎటువంటి సంబంధం వుండే అవకాశం లేదు. స్వతహాగా ఆవేశపరుడైన పోసాని ఈ చర్చలో రాజకియవేత్తగా కాకుండా, సినిమాకు సంబంధించిన మనిషిగా మాట్లాడివుంటే బావుండేదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.