Site icon TeluguMirchi.com

ఇవాళే కలిసిన ‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్’..


‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యాజికల్ ఫిలిమ్స్ తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. నాయకనాయికల పదేళ్ల జీవిత ప్రయాణాన్ని ఏడు దశల్లో సహజంగా చూపించనున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ‘కనుల చాటు మేఘమా’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు.

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన మొదటి రెండు సినిమాలు ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’కు సంగీతం అందించిన కళ్యాణి మాలిక్ ముచ్చటగా మూడో చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అప్పట్లో వంశీ-ఇళయరాజా కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ ఉందో.. ఇప్పుడు కేవలం రెండు చిత్రాలతోనే శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ కాంబినేషన్ కూడా అలాంటి ప్రత్యేక క్రేజ్ ను సొంతం చేసుకోవడం విశేషం. వీరి కలయికలో వచ్చిన సినిమాల్లోని మెలోడీలు ఎంతో ఆహ్లాదకరంగా, ఓ కొత్త లోకంలో విహరింపజేసే అంత హాయిగా ఉంటాయి. ఇటీవల ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి విడుదలైన మొదటి పాట ‘కనుల చాటు మేఘమా’ కూడా శ్రోతలను కట్టిపడేసింది. ఇక ఈ సోమవారం సాయంత్రం రెండో పాటగా విడుదలైన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టైటిల్ సాంగ్ కూడా అదే స్థాయిలో మెప్పిస్తోంది.

నాయకా, నాయికల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? వారి ప్రయాణం సాగింది? అనే విషయాలను తెలుపుతూ సాగే పాట ఇది. లిరికల్ వీడియోలో నాయకా నాయికల కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పాత్రల తీరు, వారి పరిచయం కాస్త భిన్నం అని తెలిపేలా.. వీడియో ప్రారంభంలో ఓ వైపు నాయకా నాయికలు వర్షంలో తడుస్తూ ఉండటం, మరోవైపు ఆకాశంలో సూర్యుడు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. మొదటి నుండి చివరి వరకు వారి ప్రయాణం ఎంతో అందంగా ఆసక్తికరంగా సాగిందని అర్థమవుతోంది. “ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..” అంటూ సాగే ఈ పాట మొదటిసారి వినగానే పాడాలి అనిపించేలా ఎంతో అందంగా, అర్థవంతంగా ఉంది. అందమైన మెలోడీలను స్వరపరచడంలో దిట్ట అయిన కళ్యాణి మాలిక్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ఆయన స్వరపరిచిన సంగీతం అందెల సవ్వడిలా, సెలయేటి నడకలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ పాటలో తన సంగీతంతో మాత్రమే కాదు, తన స్వరంతోనూ కట్టిపడేసారు కళ్యాణి మాలిక్. గాయని నూతన మోహన్ తో కలిసి ఆయన ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ ఈ పాటకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే టైటిల్ కి తగ్గట్లుగానే సహజత్వం ఉట్టిపడేలా తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించేలా ఆయన పాట రాసిన తీరు ఆకట్టుకుంది. “కనులకీ కనులు కవిత రాసెనుగ.. మనసుతో మనసు కలుపుకోగా.. ఒకరినీ ఒకరు చదువుతూ మురిసిపోయారు గమ్మత్తుగా” అంటూ తన పదాల అల్లికతో మెప్పించారు భాస్కరభట్ల.

ఈ పాట విడుదల సందర్భంగా గీత రచయిత భాస్కర భట్ల రవికుమార్ మాట్లాడుతూ.. “చిత్ర నాయకా, నాయికల పరిచయ గీతం అని చెప్పుకోవచ్చు. వారిద్దరూ అసలు ఎవరు..? ఒకరికొకరు పరిచయం ఎలా…? దాని పరిణామ క్రమం ఏమిటి…? కలసిన తరువాత వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి..? అది ఎలా సాగింది…ఈ భావాలన్నింటినీ ఈ గీతంలో దర్శకుడు అవసరాల శ్రీనివాస్ గారు శైలి లో చెప్పే ప్రయత్నం చేశా. నేను రాసిన మరో మంచి గీతం ఇది. జో అచ్యుతానంద తరువాత మళ్లీ ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో పాట రాయటం చాలా సంతోషంగా ఉంది. ఇందులో మూడు గీతాలు రాశాను. మంచి చిత్ర నిర్మాణ సంస్థ లో ఈ విధంగా భాగస్వామ్యం కావటం మరింత సంతోషాన్నిచ్చింది.” అన్నారు.

Exit mobile version