తెలుగు మిర్చి రేటింగ్ 2/5
దర్శకుడిగా శ్రీనివాస్ అవసరాల తీసిన రెండు సినిమాలు రొమాంటిక్ కామెడీలే. ఇప్పుడు తన మూడో సినిమాగా ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నాగశౌర్యకి ఈ జానర్ బాగా కలిసొస్తుంది. టీజర్ ట్రైలర్ ఆసక్తిని పెంచాయి. దీంతో అబ్బాయి అమ్మాయి చుట్టూ పాజిటివ్ బజ్ వచ్చింది. మారా బజ్ ని ఈ సినిమా నిలబెట్టుకుందా ? అవసరాల మార్క్ కనిపించిందా ?
సంజయ్ పీసపాటి (నాగ్ శౌర్య), అనుపమ కస్తూరి (మాళవిక నాయర్) ఒకే కాలేజ్ లో ఇంజనీరింగ్ చేస్తారు. సంజయ్ కంటే అనుమప ఏడాది పెద్ద. అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. మాస్టర్స్ కోసం లండన్ వెళ్తారు. అక్కడ వారి స్నేహం ప్రేమగా మారి సహజీవనం కూడా చేస్తారు. అయితే అనుకోని పరిస్థితులు వలన వారి మధ్య దూరం ఏర్పడుతుంది. సంఘటన కారణంగా సంజయ్ కి దూరం అవుతుంది అనుమప. తర్వాత మళ్ళీ ఈ జంట కలిసిందా ? వీరి ఎడబాటుకి కారణం ఏమిటి ? అనేది మిగతా కథ.
అవసరాల శ్రీనివాస్ రాసుకునే కథ లైటర్ వెయిన్ లోనే వుంటాయి. ‘ఫలానా’ కథ అయితే మరీ లైట్ వుంటుంది. అయితే కథ ఎలా వున్నా దాన్ని తనదైన ట్రీట్‌మెంట్ రక్తికట్టించడం అవారాల మార్క్. ఫలానా విషయానికి వచ్చేసరికి ఆయన మార్క్ తప్పింది. సింపుల్ గా చెప్పుంటే చాలా రెగ్యులర్ లవ్ స్టొరీ ఇది. అమ్మాయి అబ్బాయి కలవడం ఓ సంఘటన కారణం విడిపోవడం మళ్ళీ కలవడం.. కొన్ని వందల సినిమాల్లో చూసుకుంటాం. అదే లైన్ ని రాసుకొని.. దాన్ని నాన్ లినియర్ స్క్రీన్ ప్లే తో అటుతిప్పి ఇటు తిప్పి ముందు వెనుక చేసి.. ఎదో బ్రహ్మపదార్ధం చూపిస్తున్నారనే బ్రమ కల్పించారు. అయితే రెండు చాప్టర్ లు తర్వాత ఈ బ్రమలు కూడా తొలగిపోతాయి. తర్వాత అమ్మాయి అబ్బాయి కథ ఎంతకీ ముందుకు వెళ్ళదు.
చెప్పడానికి కథ లేనప్పుడు పాత్రల చుట్టూ సరైన వినోదం రాసుకోవాల్సింది. కానీ అదీ జరగలేదు. చెప్పడానికి కథ లేక, అటు వినోదం కూడా రాబట్టుకోలేక సన్నివేశాలని సుదీర్గంగా సాగదీశారు. ఈ కథలో అనుపమ సంజయ్ ని దూరం పెట్టడానికి కారణం.. తను హాస్పిటల్ వున్నపుడు సంజయ్ రాలేదని. పేపర్ మీద రాసుకున్నపుడు ఇది బలమైన ఎమోషనే కావచ్చు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు మాత్రం ఆ ఎమోషన్ ని ఫీలవ్వలేదు. పైగా చివర్లో డానికి కారణం చెబుతుంటే.. అది డైలాగుల్లో కలిసిపోయిందే కానీ ప్రేక్షకుల మనసుల్ని కదిలించలేకపోయింది.
నాగశౌర్య విభిన్నమైన లుక్స్ లో కనిపించే అవకాశం ఇచ్చిన స్క్రిప్ట్ ఇది. తన లుక్స్ నటన తో ఆ తేడాని చూపించాడు. అయితే ఇలాంటి కథలు ఆయనకి అలవాటే. దీంతో ఎదో కొత్తగా చేశాడనే ఫీలింగ్ మాత్రం కలగలేదు. మాళవిక సహజంగా కనిపించింది. అయితే వీరి కెమిస్ట్రీని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. శౌర్య స్నేహితుడిగా కనిపించిన నటుడు అవకాయ్ సీన్ లో నవ్విస్తాడు. అలాగే నీలిమ రత్నబాబు పాత్రలో కూడా హ్యుమర్ వుంటుంది. మేఘ చౌదరి పాత్రకు పెద్ద ప్రాధన్యత లేదు.శ్రీనివాస్ అవసరాల అతిధి పాత్ర లాంటింది చేశారు. మిగతా వారు అలా కనిపించారు.
టెక్నికల్ గా సినిమా డీసెంట్ గా వుంటుంది. ఫొటోగ్రఫీ నీట్ గా ఉంది. కళ్యాణి మాలిక్ క్లాస్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా ఎంత బావున్నప్పటికీ కథ, కథనం, పాత్రలు రూపకల్పనలో అవసరాల మార్క్ తప్పింది. రెండు గంటల నిడివి గల సినిమా పూర్తయ్యే నాలుగు గంటల్లా అనిపించిందంటే.. ఫనలా అబ్బాయి అమ్మాయి.. సహనానికి ఎంత పరీక్ష పెడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఫినిషింగ్ టచ్ : సహనానికి పరీక్ష పెట్టిన అమ్మాయి అబ్బాయి