Site icon TeluguMirchi.com

“ఇది అది కాదంటూ.. పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ” అంటున్న నాగశౌర్య


యువ కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఇక కళ్యాణి మాలిక్ స్వరపరిచిన పాటల్లో ముఖ్యంగా ‘కనుల చాటు మేఘమా’ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ‘కఫీఫీ’ పాట విడుదలైంది.

‘కఫీఫీ’ లిరికల్ వీడియోను బుధవారం ఉదయం విడుదల చేశారు మేకర్స్. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుండి ఇప్పటిదాకా విడుదలైన పాటలు హాయిగా, ఆహ్లాదకరంగా సాగే మెలోడీలు అయితే.. ఈ పెప్పీ నెంబర్ మాత్రం అందరిలో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. ‘కఫీఫీ’ అంటూ అందరూ కాలు కదిపేలా అద్బుతమైన బాణీ సమకూర్చారు వివేక్. “నలుగురిలో ఉంటే.. చిలిపిగ పోతుంటే.. చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ” అంటూ పాట సాగింది. పాట సందర్భానికి, బాణీకి తగ్గట్లుగా కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం అందంగా, అర్థవంతంగా ఉంది. “ఇది అది కాదంటూ.. వివరము వేరంటూ.. పరిమితిలోనే ఉంచేదే కఫీఫీ”, ” పరిధులు లేని వింత సహవాసం పరిగెడుతుంటే తగదుగా” అంటూ మళ్లీ మళ్లీ పాడుకునేలా క్యాచీ లిరిక్స్ తో లోతైన భావాన్ని పలికించారు. గాయకులు బెన్ హ్యూమన్, విష్ణుప్రియ తమ మధుర గాత్రంతో పాటను ఎంతో ఉత్సాహంగా ఆలపించారు. మొత్తానికి ఈ పాటకి థియేటర్లలో అద్భుతమైన స్పందన లభించడం ఖాయమనిపిస్తోంది.

Kafeefi Lyrical | Phalana Abbayi Phalana Ammayi | Naga Shaurya | Malvika Nair | Vivek Sagar

Exit mobile version