పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు ఎంతటి విజయాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకు రంగం సిద్దం అయ్యింది. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ చిత్రాన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో త్రివిక్రమ్ సినిమాకు డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది. గత ఆరు నెలలుగా పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన ఈ చిత్రానికి వచ్చే నెల రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా నిర్మాత రాధాకృష్ణ వెళ్లడి చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్‌తో పొలిటికల్ స్క్రిప్ట్‌ను సిద్దం చేయించినట్లుగా తెలుస్తోంది. ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాతో వీరి కాంబో సినిమా ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. కాటమరాయుడు చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయల్లు ఎంపిక అయ్యారు. ఇక ఖుష్బు మరియు మోహన్‌లాల్‌లు అతి ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదే సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకు వచ్చేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ‘దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్‌ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.