టాలీవుడ్ టాప్ సినిమాగా కొన్ని సంవత్సరాల ముందు ‘మగధీర’ ఉంది. నెం.1 స్థానంలో ఆ చిత్రం చాలా కాలం పాటు ఉంది. ఆ తర్వాత నెం.1 స్థానం మారుతూ వచ్చింది. ‘బాహుబలి’ ప్రస్తుతం టాలీవుడ్ నెం.1 స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత స్థానంలో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెం.150’ చిత్రం ఉంది. ఇటీవలే నెం.2 స్థానంను దక్కించుకున్న చిరంజీవికి ఆ స్థానం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలే అవకాశాలున్నాయి. ఈనెలాఖరున విడుదల అవ్వబోతున్న ‘కాటమరాయుడు’ సినిమా ఖైదీ కలెక్షన్స్‌ను క్రాస్ చేయడం ఖాయం అంటూ పవన్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
పరిస్థితులు చూస్తుంటే కాటమరాయుడు రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ వసూళ్లు చేస్తుందేమో అనిపిస్తుందని సినీ విశ్లేషకులు మరియు ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మొదటి వారం రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను సాధించే లక్ష్యంతో నిర్మాత శరత్ మరార్ ‘కాటమరాయుడు’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఖైదీ కలెక్షన్స్ రికార్డు గాల్లో కొట్టుకు పోవాల్సిందే అనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ విషయంలో ఖైదీ కంటే ఎక్కువే దక్కించుకున్న కాటమరాయుడు ముందు ముందు కూడా మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంటున్నారు.
‘గోపాల గోపాల’ దర్శకుడు డాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ సినిమాకు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. కాటమరాయుడు నెం.2 స్థానంకు చేరితే ఆ రికార్డును మహేష్‌బాబు, మురుగదాస్ సినిమా క్రాస్ చేసే అవకాశాలున్నాయి.