ఏనుగు చచ్చిన వెయ్యి వరహాలు, బతికి ఉన్నా వెయ్యి వరహాలే అంటారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ అయినా, అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఆయన తర్వాత సినిమా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు అనే విషయం వాస్తవం. అందుకే ఆయనతో సినిమాను నిర్మించాలని నిర్మాతలు ఉవ్విల్లూరుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ వారు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరితో సినిమాలు తీయాలని కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నారు. ఇటీవలే చరణ్‌తో సినిమా కమిట్ చేయించిన వీరు పవన్‌తో సినిమాకు ఒప్పించారు.
‘కాటమరాయుడు’ సినిమా విడుదలకు ముందే పవన్‌ను కలిసిన ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కలిసి కథ చెప్పిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు పవన్ పాజిటివ్‌గా స్పందించాడు. దాంతో వెంటనే మైత్రి మూవీ మేకర్స్ వారు రంగంలోకి దిగి ఆ సినిమాను తాము నిర్మిస్తామని పవన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ సినిమా కోసం పవన్ కేవలం 40 రోజులు కేటాయిస్తే చాటు ఆ 40 రోజులకు గాను ఏకంగా 40 కోట్ల పారితోషికం ఇస్తామంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు అంటున్నారు.
ప్రస్తుతం డబ్బు అవసరం చాలా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాను వదులుకోవద్దని నిర్ణయించుకున్నాడు. వచ్చే నెల మొదటి వారంలో త్రివిక్రమ్ సినిమా ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఉంటుందేమో చూడాలి. రోజుకు కోటి చొప్పున పారితోషికం తీసుకోబోతున్న ఏకైక సౌత్ హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డ్ సాధించబోతున్నాడు.