వ‌వ‌న్ … న‌డిచొచ్చే సునామీ!!

pavanప‌వ‌న్ క‌ల్యాణ్ – చిరంజీవిలా డాన్సులు చేయ‌లేడు. కానీ అత‌ని న‌డ‌క‌లో నాట్యం ఉంటుంది. అతిగొప్ప డైలాగ్ డెలివ‌రీ కాదు. కానీ అత‌ని నుంచి వ‌చ్చే శ్వాస కూడా చ‌ప్పట్లు కొట్టించే డైలాగ్ అయిపోతుంది. గాల్లో ఎగురుకొంటూ వ‌చ్చి ఫైటింగులు చేయ‌డు.. జ‌స్ట్ చేయి మెడ ద‌గ్గర రుద్దుకొంటాడంతే. రౌడీల‌ పిల‌మిడ్లు రాలిపోతాయ్‌..!! అదో హైటెన్షన్ యాక్షన్ సీను కంటే వంద రెట్లు గొప్పగా అనిపిస్తుంది. ఇవే… అచ్చంగా ఇవే అత‌డిని తెలుగు తెర‌పై ఓ సునామీలా విరుచుకుప‌డిపోయే.. చోటిచ్చాయి.

అంద‌రిలా ప‌వ‌న్ తెర‌పైనే హీరో అయితే అభిమాన సంఘాలు పుట్టేవి. వాళ్లు అత‌ని సినిమా ఒక‌టికి నాలుగుసార్లు చూసేవారేమో. మ‌హా అయితే పుట్టిన రోజుకి ర‌క్తదానాలు చేసేవారు. అయితే ప‌వ‌న్ అట్టాంటిట్టాంటి హీరో కాదు.
రెండు ర‌కాల ప‌వ‌న్‌లు మ‌న‌కు క‌నిపిస్తారు. తెర‌పై క‌నిపించే హీరో! లోప‌ల దాగున్న మ‌రో హీరో!!

తెర‌పై క‌నిపించే హీరో – అభిమానుల కోసం ఏమైనా చేస్తాడు. న‌టిస్తాడు, పాడ‌తాడు, డైరెక్షన్ చేస్తాడు, కొరియోగ్రఫీ అంటాడు, ఫైట్ మాస్టర్ అవ‌తారం ఎత్తుతాడు. పాట‌లు రాస్తాడు అన్నీ! లోప‌ల దాగున్నా హీరో మాత్రం ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. కానీ ఆలోచిస్తుంటాడు. ఈ స‌మాజం గురించి, క‌ల‌చివేస్తున్న అస‌మాన‌త‌ల గురించి త‌న‌లో తానే కుమిలిపోతుంటాడు. లోప‌ల ఓ తాత్విక వేత్త ఉన్నాడు, ఓ మాన‌వ‌తావాది ఉన్నాడు. ఇవి రెండూ అత‌ని అభిమానుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకొన్నాయి. చేతిలో సినిమాలున్నా లేకున్నా, విజ‌యాలు సాధించిన లేకున్నా – ప‌వ‌న్‌ని దేవుడిగా కొలుస్తున్నారంటే కార‌ణం అదే. హిట్, ఫ్లాప్ అంద‌రితోనూ ఆడుకొంటాయి. ప‌వ‌న్‌కీ అవి మామూలే. కానీ హిట్ వ‌చ్చినప్పుడూ, ఫ్లాప్ ఎదురైన‌ప్పుడూ అత‌ని ఇమేజ్‌, క్రేజ్ అలాగే ఉంది. చెక్కు చెద‌రలేదు. ఎందుకంటే వ‌రుస‌గా ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా – ప‌వ‌న్ ఏమిటో, పంజా విప్పితే ఆ దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో బాక్సాఫీసుకు తెలుసు. అందుకే అత‌ను ప‌వ‌ర్ స్టార్ అయ్యాడు. ప‌వ‌న్‌ని అత‌ను సాధించిన విజ‌యాల‌తో మాత్రమే బేరీజు వేయ‌లేం. అత‌ని స్టామినాకు బాక్సాఫీసు వ‌సూళ్లే కొల‌త‌లూ, తూనిక‌రాళ్లు కావు. అత‌ని వ్యక్తిత్వమే ప‌వ‌న్‌ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప‌వ‌నిజం అంటూ కుర్రకారు గొంతులు చించుకొంటున్నారంటే కార‌ణం తెర‌పై అత‌ని హీరోయిజం చూసి కాదు, బ‌య‌టా రియ‌ల్ హీరోనే అని న‌మ్మి. దాన్ని అక్షరాలా కాపాడుకొంటూ వ‌స్తున్నాడు ప‌వ‌న్‌.

త్వర‌లో అత్తారింటికి దారేది అంటూ రికార్డుల‌ను వెతుక్కొంటూ రాబోతున్నాడు. ప‌వ‌న్ గాలి ఇలాగే తుఫాన్‌లా, సునామీలా విరుచుకుప‌డాల‌ని… అత‌ని ఆశ‌లు, ఆశ‌యాలూ సాకారం కావాల‌ని తెలుగు మిర్చి ఆకాంక్షిస్తూ… హ్యాపీ బ‌ర్త్‌డే టూ… ప‌వ‌ర్ స్టార్‌, ప‌వన్ క‌ల్యాణ్‌.