ఇటు చ‌ర‌ణ్ – అటు ప‌వ‌న్‌.. మ‌ధ్యలో ఎవ‌డొస్తాడు??

pavancharanమెగా హీరోల‌కు ఓ అడ్వాంటేజ్ ఉంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ప్రారంభ వ‌సూళ్లను కొల్లగొడుతుంది. కాస్త బాగుంది.. అనిపిస్తే ఇక తిరుగేలేదు. అందుకే మెగా హీరో సినిమా వ‌స్తొందంటే – మిగ‌తా సినిమాలు ప‌క్కకు పోతాయి. త‌ర‌వాత చూద్దాంలే అనుకొని త‌మ సినిమాల్ని వాయిదా వేసుకొంటుంటారు. ఇప్పుడు వ‌రుస‌గా కేవ‌లం వారం రోజుల వ్యవ‌ధిలో ఇద్దరు మెగా హీరోలు బాక్సాఫీసు ద‌గ్గర సంద‌డి చేయ‌బోతున్నారు. వారి మ‌ధ్యలో వ‌చ్చి న‌లిగిపోయే ధైర్యం ఎవ‌రికి ఉంది??

ఎవ‌డు…? సినిమాపై ముందునుంచీ భారీ అంచ‌నాలున్నాయి. టీజ‌ర్‌, పాట‌లూ అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకొన్నాయి. ఇది మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల త‌ర‌హాలో ఉండ‌ద‌నే విష‌యం అర్థమైంది. పైగా చ‌ర‌ణ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ర‌చ్చ, నాయ‌క్ సినిమాల‌తో హిట్లు కొట్టి – హ్యాట్రిక్ పై క‌న్నేశాడు. వంశీపైడిప‌ల్లి కూడా బృందావ‌నంతో ఆక‌ట్టుకొన్నాడు. పైగా దిల్‌రాజు బ్యాన‌రాయె. కాబ‌ట్టి ఈ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి. ఈనెల 24న విడుద‌ల చేయాల‌ని అనుకొన్నా – జులై చివ‌రి వారానికి వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. ఎప్పుడొచ్చినా, బాక్సు బ‌ద్దలు కొట్టడం ఖాయంగానే క‌నిపిస్తోంది.

ఇక అత్తారింటికి దారేది విష‌యానికొస్తే చిన్న టీజ‌ర్‌తోనే ప్రభంజ‌నం సృష్టించేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. త్రివిక్రమ్ ద‌ర్శక‌త్వ శైలి, అందులో ప‌వ‌న్ ఇమిడిపోయే విధానం గురించి అంద‌రికీ తెలిసిందే. జ‌ల్సాతో ఈ ప‌వ‌ర్‌ఫుల్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో చూసేశారు. వారిద్దరి నుంచి ఇంకో సినిమా వ‌స్తుంద‌టే అంచ‌నాలు మామూలుగా ఉండ‌వు. దానికి తోడు అత్తారింటికి దారేది – టైటిల్ కూడా అటు అభిమానులకు ఇటు కుటుంబ ప్రేక్షకుల‌కు చాలా న‌చ్చేసింది. నువ్వునాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వరి త‌ర‌హా క‌థ‌ల్లో ప‌వ‌న్ ఇమిడిపోతు చూడాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి త‌గిన క‌థే దొరికింది. అయితే టీజ‌ర్ మాత్రం ద‌ద్దరిల్లిపోయింది. ఆర‌డుగుల బుల్లెట్టూ, ధైర్యం విసిరిన రాకెట్టూ అంటూ హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఓ రేంజులో చూపించారు. సినిమాలో కూడా ఆ స్థాయిలో యాక్షన్ అంశాలుంటాయ‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 7కి బెర్తు ఖాయం చేసుకొంది. అటు చ‌ర‌ణ్, ఇటు ప‌వ‌న్ – ఇద్దరూ ఊపు మీదున్నారు. మ‌రి మ‌ధ్యలో వ‌చ్చి ఇరుక్కుపోయే ధైర్యం ఎవ‌రికి ఉంది. ఈ సినిమా ఏమాత్రం నిల‌బ‌డినా మిగ‌తావాటికి క‌నీస వ‌సూళ్లు కూడా ఉండ‌వు. అందుకే చిన్న సినిమాలు జంకుతున్నాయి. ద‌ళం, రొమాన్స్‌, అడ్డా లాంటి అర‌డ‌జ‌ను సినిమాలు రిలీజ్‌కి సిద్ధమ‌య్యాయి. కానీ వ‌ద్దామా, రావొద్దా..? అని వెన‌క్కీ ముందుకీ జ‌రుగుతున్నాయి. ఎవ‌డు, అత్తారింటికి దారేది వ‌చ్చివెళ్లిపోయే వ‌ర‌కూ మరో సినిమా రాకపోయినా ఆశ్చర్యపోన‌వ‌స‌రం లేదు.