Operation Valentine : ఈ సినిమా గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ : మెగాస్టార్ చిరంజీవి


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. “మా కుటుంబంలో ఎవరి ఈవెంట్ జరిగినా తమ ఇంట్లో వేడుకలా ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు వచ్చి మమ్మల్ని ఉత్సాహపరిచే మా అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు ‘నీతో మాట్లాడాలి డాడీ’ అంటూ వరుణ్ తేజ్ నుంచి మెసేజ్ వచ్చింది. వరుణ్‌ సాధారణంగా నాకు మెసేజ్‌లు పెట్టడు.. నేరుగా మాట్లాడతాడు. ఏమైందో అనుకున్నా. హైదరాబాద్‌ తిరిగొచ్చాక ఈ సినిమా, ఈవెంట్‌ గురించి చెప్పాడు. రియల్‌ హీరోలపై తీసిన చిత్రం గురించి మీరు చెబితే రీచ్‌ వేరేలా ఉంటుందన్నాడు. సరహద్దుల్లో ఉంటూ మనల్ని కాపాడే వారియర్స్‌ గురించి చెప్పడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ వేడుకకు రావడం గర్వంగా ఉంది. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు హృదయవిదారకరంగా ఉంటుంది. ఆ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించేలా.. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన భారత వైమానిక దళం చేసిన సాహసోపేతమైన యుద్ధమే ఈ సినిమా. ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది కాబట్టి సినిమా పరంగా పెట్టిన పేరు ‘ఆపరేషన్ వాలెంటైన్’ అని వరుణ్ చెప్పినప్పుడు చాలా సెన్సిబుల్ గా వుందనిపించింది.

తెలుగులో అవకాశాలు వుంటాయి, మంచి పారితోషికం ఉంటుందని, కమర్షియల్‌ డైరెక్టర్‌గా స్థిరపడిపోవచ్చనే ఉద్దేశంతో దర్శకుడు శక్తి ప్రతాప్‌ ఇక్కడకు రాలేదు. తన సొంత ఖర్చుతో దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసి సర్జికల్‌ స్ట్రైక్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈసారి సినిమా తీస్తే మరింత సమాచారం మేమిస్తామని అధికారులు ఆయన్ను ప్రోత్సాహించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కంటెంట్ ని అద్భుతంగా తీశాడు. సిద్దు, సోనీ పిక్చర్స్ కలసి చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. సినిమా అద్భుతంగా వచ్చిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి సినిమాలు ఆడాలి. ముఖ్యంగా యూత్ చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. రియల్ హీరోస్ కి ఒక సెల్యూట్ గా ఈ సినిమా మనమందరం చూసి తీరాలి. ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. రిజనబుల్ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్‌, రిచ్ నెస్ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే దర్శకుడు శక్తి సక్సెస్‌ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నవదీప్‌ మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. రామ్‌ చరణ్‌ ‘ధ్రువ’ సినిమాలోని తన నటన నాకు ఇష్టం. ఇందులోనూ మంచి పాత్ర పోషించాడు. అభినవ్‌ ట్యాలెంటెడ్. సోషల్‌ మీడియాలో కనిపించే మీమ్స్‌లో తనే ఎక్కువగా కనిపిస్తాడు.

చరణ్‌, వరుణ్‌.. ఇలా వీరంతా నన్ను చూస్తూ వేరే రంగంలోకి వెళ్లలేకపోయారని భావిస్తాను. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగారు. ఈ విషయంలో నేను అందరినీ ప్రోత్సహిస్తా. ఎందుకంటే చిత్ర పరిశ్రమను నేను గౌరవిస్తా. మనం ఎంతగా గౌరవిస్తే అంతగా మనల్ని అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మా. అలాంటి ఇండస్ట్రీలోకి నా బిడ్డలొచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముంది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చారమో కానీ నటుడిగా వరుణ్‌ నన్ను ఎప్పుడూ ఫాలోకాలేదు. ముందు నుంచీ విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని ఇలాంటి అవకాశాలు వరుణ్‌కు వచ్చాయి. తను అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ముకుంద, కంచె, గద్దలకొండ గణేష్, ఫిదా, తొలిప్రేమ ఇవన్నీ దేనికవే భిన్నమైన చిత్రాలు. అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు. ఎయిర్‌ ఫోర్స్‌పై టాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. ఈ చిత్రం ప్రేక్షకులకు కన్నుల పండగలా వుంటుంది. గతేడాది హాలీవుడ్‌ సినిమా ‘టాప్‌గన్‌’ లోని విజువల్స్‌ చూసి ఇలాంటిది మనం తీయగలమా? అనుకున్నా. ఇప్పుడు మన వాళ్ళు వరుణ్, సిద్దు, శక్తి వీరంతా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అదే స్థాయిలో తీశారు. టాలెంట్‌ ఒకరి సొత్తు కాదు. మనం కూడా ఆ స్థాయిలో వున్నాం. సినిమాలో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా బెస్ట్ విషెష్. ఈ సినిమా గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్. మార్చి 1న థియేటర్లలో చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమాని విజయవంతం చేసి మన సైనికులకు సెల్యూట్‌ చేయాల్సిన బాధ్యత అందరిపై వుంది. జై హింద్” అన్నారు.