ఆగస్టు నెల ఏమాత్రం అచ్చు రాలేదు. వచ్చేస్తాయ్… వచ్చేస్తాయ్ అనుకొన్న పెద్ద సినిమాలు తూచ్ చెప్పేశాయ్. సమాఖ్యాంధ్ర ఉద్యమ ప్రభావం ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. ఆ ఉద్యమానికి ధీటుగా సినిమాలు విడుదల చేసే పరిస్థితి లేదు. దాంతో బాక్సాఫీసు కళ తప్పింది. గతనెల 31న ఎవడు సినిమా వచ్చేసేదే. కానీ అత్తారింటికి దారేది సినిమాకి భయపడి.. వాయిదా వేసుకొంది. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. లేదంటే ఉద్యమ హోరుకు బలయ్యేది. ఇక పవన్ కూడా వెనుకడుగు వేయాల్సి వచ్చింది. చివరి క్షణాల్లో ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఈ రెండు సినిమాలకు భయపడిన చిన్న సినిమాలు అసలు రిలీజ్ డేట్ గురించే ఆలోచించలేదు. దాంతో ఈ శుక్రవారం బాక్సాఫీసు ఖాళీ అయిపోయింది. 1000 అబ్దద్దాలు, అడ్డా, పైసా, ప్రేమ ఒక మైకం, చండీ… ఇలా దాదాపు ఓ పాతిక సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద సినిమాలు రావడం లేదు కదా.. ఇవైనా బయటకు వస్తాయేమో చూడాలి.