యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌లో ముస్లిం సోదరుల మనోభావాలను కించ పరిచే అంశాలున్నాయని తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ విషయంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ – ”’నాన్నకు ప్రేమతో’ చిత్రానికి సంబంధించిన ఒక సాంగ్ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ ముస్లిం సోదరుల మనో భావాలను కించపరిచే విధంగా వుందని మా దృష్టికి వచ్చింది. మేం అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తాం. అందుకే ఆ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ని తొలగించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశాం. అలాగే సినిమాలోని ఆ సాంగ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చేస్తున్నాం. మేం విడుదల చేసిన పోస్టర్ వల్ల ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి మేం బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. వారి మనోభావాలను దెబ్బతియ్యాలనికానీ, వారికి చెడు తలపెట్టాలని కానీ మా ఉద్దేశం కాదు. అన్ని మతాల వారికి స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు వుంది. ఆ పోస్టర్ అనుకోకుండా వచ్చిందే తప్ప ముస్లిం సోదరులను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో రిలీజ్ చేసింది కాదు” అన్నారు.