Site icon TeluguMirchi.com

రివ్యూ : నాయక్‌

రివ్యూ : నాయక్‌

నటీనటులు : రాంచరణ్‌, కాజల్‌ అగర్వాల్‌, అమలా పాల్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఛోటా కె నాయుడు
సంగీతం : తమన్‌
నిర్మాత : డివివి దానయ్య
దర్శకత్వం : వివి వినాయక్‌

 యాక్షన్‌ ఝలక్‌…. కామెడీ ఛమక్‌.. వెరసి తళుక్‌…! “నాయక్‌”:

ప్రేక్షకులకు ఏం కావాలో అది అందించేస్తే…. ఏ రిస్కూ వుండదు. ఓ పాటా, వెంటనే ఫైట్… కొన్ని కామెడీ సన్నివేశాలూ… కూరలో కాస్త తాళింపు వేసినట్టు ఎమోషన్స్ దట్టిస్తే సినిమా నిలబడిపోతుంది. ‘అదేదో సినిమాలో అచ్చం ఇలాగే జరిగిందే..’ అనుకునేలోపు ఇంకేదో మాయ చేసే టెక్నిక్ తెలిస్తే… ‘కాపీ’ అనే అపనింద నుంచి తప్పించుకోవచ్చు. ‘చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా’లకు కాలం చెల్లిపోయింది. నిర్మాత, చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు సంతృప్తిగా వుండే సినిమానే తీస్తాం అని దర్శకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఆ కోవలో మరో సినిమా వచ్చింది… అదే ‘నాయక్’. మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన దర్శకుడు వినాయక్. చిరంజీవికి ‘ఠాగూర్’లాంటి మెగా హిట్ ఇచ్చాడు. చిరు ఫాన్స్ కి ఎలాంటి మసాలా కావాలో వినాయక్ కి బాగా తెలుసు. అవన్నీ మేళవించి… మాస్ కి నచ్చే మరో విందు భోజనం సిద్ధం చేశాడు. వినాయక్… చిరు ఫామిలికి మరో హిట్ ఇచ్చాడా? ఈ ఏడాది ‘నాయక్’ విజయాల బోణీ చేశాడా? ఈ విషయాలు తెలుసుకునే ముందు రివ్యూ లోకి పదండి….

చెర్రి ( రామ్ చరణ్) అచ్చమైన హైదరాబాద్ కుర్రాడు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటాడు. తన జిలేబీ మావయ్య (బ్రహ్మానందం) కోసం… లోకల్ దాదా (రాహుల్‌ దేవ్‌) ఫ్యాన్ గా నటిస్తాడు. అతని చెల్లెలు మధు ( కాజల్) ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. చెర్రి మంచితనం చూసి… మధు కుడా మనసు ఇచ్చేస్తుంది. ఈ విషయం దాదా కి తెలుస్తుంది. వెంటనే చెర్రి పని పడదామని వెళ్తాడు. అక్కడ చెర్రి ఓ పోలీస్ అధికారిని కాల్చేయడం కళ్ళారా చూస్తాడు. కోల్‌ కతాలో మంత్రి రావత్ (ప్రదీప్ రావత్) తమ్ముడి హత్య కేసు ఛేదించడానికి హైదరాబాద్ వచ్చిన సీబీఐ అధికారి ( ఆశిష్ విద్యార్ధి)… సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా పోలీసుని చంపింది, కోల్‌ కతాలో హత్యలు చేసిందీ చెర్రీనే అనే విషయం అర్ధమవుతుంది. చెర్రి ఇంటికి వెళ్తే… తను అప్పటికి కోల్‌ కతా వెళ్లినట్టు తెలుస్తుంది. మరో వైపు రావత్ హత్యకు కుట్ర జరిగిందనే సమాచారం సీబీఐకి అందుతుంది. వెంటనే పోలీస్ బలగాలు కోల్‌ కతా వెళ్తారు. అక్కడ చెర్రిని పట్టుకుంటారు. అయితే.. అదే పోలికలతో వున్న ‘సిద్దార్ధ్ నాయక్’ ని చూసి షాక్ తింటారు. నిజానికి ఈ హత్యలన్నీ చేసింది ఈ నాయకే! ఇంతకీ సిద్దార్ధ్ నాయక్ ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేశాడు? అనే చిక్కుముడులకు సమాధానం రెండో భాగం లో తెలుస్తుంది.

నిజం చెప్పాలంటే నాయక్ కొత్త కధ, గొప్ప కధ కానే కాదు. చాలా సినిమాల ప్రభావం ‘నాయక్’పై వుందనే విషయం సామాన్య ప్రేక్షకుడికి సులువుగా అర్ధం అవుతుంది. ‘మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి’ అనే చిన్న పాయింట్ చుట్టూ అల్లిన కధ ఇది. ‘నాయక్’ అనగానే అభిమానులతో పాటు… సగటు సినీ ప్రేక్షకుడు ‘ఠాగూర్’ స్థాయి సినిమా అనే అంచనాలు వేసుకున్నారు. ఠాగూర్ లో సామాజిక అంశాలు, కమర్షియల్ విషయాలు తక్కిట లో వేసి కొలిచినట్టు సమానంగా తూగాయి. ఈసారి దర్శకుడు కమర్షియల్ సూత్రాలనే ఎక్కువ నమ్ముకున్నాడు.

సినిమా మొదలెట్టే ముందు వినాయక్ మదిలో ‘ఫాన్స్ ని ఎలాగైనా సరే సంతృప్తి పరచాలి’ అనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. దానికి అనుగుణంగానే సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్ళాడు. ‘కృష్ణ’, ‘అదుర్స్’ సినిమాలతో బలమైన యాక్షన్ ఘట్టాలే కాదు… వినోదం కుడా కీలకమే అనే విషయాన్ని వినాయక్ గ్రహించాడు. అందుకే ‘నాయక్’ కధని ఎంటర్తైన్మెంట్ తో నడపడంలో విజయవంతం అయ్యాడు. తొలి భాగంలో నవ్వులు పంచే బాధ్యత జిలేబీ బ్రహ్మానందం తీసుకున్నాడు. సెకండ్ ఆఫ్ లో పోసాని, జయ ప్రకాష్ రెడ్డి… ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసారు. ‘దూకుడు’ సినిమాలో ఎమ్మెస్, బ్రహ్మానందం సినిమా భారాన్ని ఎలా మోసారో… ఈసారి జయ ప్రకాష్ రెడ్డి, పోసాని.. అలా ఆదుకున్నారు. ఈ సినిమా ఎంత కామెడీ సినిమా అంటే టైటిల్స్ లో ” మద్యపానం ఆరోగ్యానికి హానికరం ” అనే సూక్తి ఎం.ఎస్.నారాయాణ తో చెప్పించటం. ఈ కార్డు పడగానే ఎమ్మెస్ గొంతు విని థియేటర్ లో ప్రేక్షకులు ఘొల్లున నవ్వేశారు.

చంపుతున్నది చెర్రి కాదు… ఆ రూపంలో వున్న వేరే వ్యక్తి అనే విషయం ఈ కధకి చాలా కీ పాయింట్ గా మారింది. ఈ పాయింట్ లేకపోతే సినిమా విశ్రాంతికి ముందే తేలిపోయేది. ఊహించని ట్విస్ట్ ఇచ్చి.. కధని అక్కడి వరకూ నిలబెట్టుకున్నారు. ద్వితీయార్ధం లోని సిద్ధార్ద్ నాయక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లను వినాయక్ తన స్టైల్ లో తీర్చిదిద్ది… సినిమా బండిని పట్టాలు ఎక్కించాడు. ‘చాక్లెట్ ఇచ్చి ఆస్తులు రాయించుకునే సన్నివేశం, జయ ప్రకాష్ వేసిన సెటైర్ లు… చాలా వరకు రిలీఫ్ ఇచ్చాయి. మొత్తం మీద అందరికి తెలిసిన ఓ కమర్షియల్ ఫార్ములానే వినాయక్ చరణ్ అభిమానులకు తగినట్టు చూపించాడు. ఆ మేరకు ఈ సినిమా మెగా ఫాన్స్ కి పండగే!

చరణ్‌ ‘రచ్చ’ కంటే ఈ సినిమాలో మరింత మెరుగైన జోష్ చూపించాడు. చెర్రి, నాయక్.. పాత్రల మధ్య గెటప్ ల పరంగా ఎలాంటి వైవిధ్యం లేకపోయినా… నటనా పరంగా మాత్రం ఆ మార్పు స్పష్టంగా తెలిసేలా జాగ్రత్త పడ్డాడు. నాయక్ గా ఒకింత హుందాతనం ప్రదర్శించాడు. డాన్స్ ల గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ఓ మాదిరిగా వున్న తమన్ పాటలు… కాస్తయినా చుడగలిగామంటే అది చరణ్ స్టెప్పుల వల్లే. ఒక పెద్ద మాస్‌ హీరో వుంటేనే కథానాయికలకు చేయడానికి ఏమీ మిగలదు. డ్యుయల్ రోల్ వుంటే… ఛాన్స్ ఇస్తారా? కాజల్, అమలాపాల్ పాటలకే పనికొచ్చారు. అమలాపాల్ కి … మేకప్ మరీ ఎక్కువైపోయింది. విలన్ల గుంపు ఎక్కువే. ప్రదీప్ రావత్ మాత్రమే కొన్ని ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాడు. సాంకేతిక పరంగా ఈ సినిమా చాలా రిచ్ గా వుంది. పాటల్లో లోకేషన్లు కొత్తగా వున్నాయి. కానీ తమన్ సంగీతమే ఈ సినిమాకి పెద్ద మైనస్. ‘తూహే నాయక్’ పాట ఒక్కటే క్యాచీ గా వుంది. అదరగొట్టే స్తుంది అనుకున్న చార్మి పాట కుడా తుస్సుమంది. ఆర్.ఆర్ దగ్గర మాత్రం మార్కులు కొట్టేసాడు. ఆకుల శివ సంభాషణల్లో పంచ్ లు ఎక్కువే పడ్డాయి. ‘చదలు పట్టిందని చార్మినార్ ని, బీటలు వారిందని తాజ్ మహల్ ని చూడడం మానేస్తామా? నేనూ అంతే’ లాంటి చమక్కులు ఈ సినిమాలో చాలానే తగులుతాయి.

‘సింహాద్రి’, ‘మన్మధ’, ‘శివాజీ’. ‘అదుర్స్’ ఇలా కనీసం అరడజను సినిమాలని ఒకే టికెట్ పై చూసినట్టు అనిపించినా… ఈ సినిమా ప్రేక్షకులకి కావలసిన టైం పాస్ ఇస్తుంది. ‘మగధీర’లా తెలుగు సినీ చరిత్రలో నిలిచే సినిమా కాకపోవచ్చు. కానీ నిర్మాత పెట్టుబడికీ, ఈ సంక్రాంతి వినోదానికీ డోకా వుండదు.

తెలుగుమిర్చి రేటింగ్‌ :  3.75/5                                                      – స్వాతి

***ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

Click here for English Version…

 

Exit mobile version