నాయక్ + సీతమ్మ = రూ. 130 కోట్లు

Seethamma-vakitlo-sirimalle-chettu-movie-review-Nayak-movie-review-శుభారంభం సగం విజయం అంటుంటారు. ఆ మాట అక్షరాలా నిజం. మన క్రికెట్లోనే చూడండి. సెహ్వాగ్, గంభీర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చినప్పుడల్లా మన జట్టు అదరగొట్టేసేది. సినిమాలూ అంతే. ఓపెనింగ్స్ రాబట్టుకొంటే.. గట్టేక్కేసినట్టే. జనవరిలో మంచి హిట్లు అందుకొంటే – ఆ యేడాదంతా ఆ జోష్ కొనసాగుతూనే ఉంటుంది. 2012లో ‘బిజినెస్ మేన్’ ఇచ్చిన కిక్ ఆ సంవత్సరమంతా కనిపిస్తూనే ఉంది. 2013 లోనూ టాలీవుడ్ కి అద్భుతమైన టేకాఫ్ లభించింది. ‘నాయక్’, ’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు విజయఢంకా మోగించి ఈ సీజన్ ని ఘనంగా ఆరంభించాయి. ఎన్నో అంచనాలను మోసుకొచ్చిన ఈ రెండు సినిమాలూ.. ప్రేక్షకుల్ని మెప్పించడమే కాకుండా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టుకొన్నాయి. ‘సూపర్ హిట్’, ‘హిట్’, ‘యావరేజ్’… అనే ఊగిసలాట కనిపించినా చివరికి నిలదొక్కుకొన్నాయి. ‘ఈ యేడాది మరిన్ని విజయాలకు ఈ సినిమాలే స్పూర్తి…’ అని నిర్మాతలు భావిస్తున్నారు.

Seethamma-vakitlo-sirimalle-chettu-movie-review-Nayak-movie-review-2రామ్ చరణ్ – వినాయక్ కాంబినేషన్ అనగానే ‘నాయక్’కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సంక్రాంతికి మూడు రోజుల ముందే వచ్చిన ఈ సినిమా తొలి రోజే ‘హిట్’ టాక్ దక్కించుకొంది. మరుసటి రోజు ‘యావరేజ్.. ‘ అనే మాట వినిపించినా చివరికి నిలదొక్కుకొంది. బీసీల్లో ఇప్పటికీ ‘నాయక్’దే హవా. ఈ సినిమా రూ. 35 కోట్లతో పూర్తయిందని ఓ అంచనా. తొలి వారంలోనే లాభాలు దక్కించుకొంది. శాటిలైట్ హక్కుల కోసం ఛానళ్లు పోటీ పడుతున్నాయిల్. ‘సీతమ్మ..’ కూడా బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతోంది. 25 యేళ్ల తరవాత వచ్చిన మల్టీస్టారర్ చిత్రం… అంచనాలకు తగిన విజయం అందుకొంది. చిన్నోడు, పెద్దోడుగా మహేష్-వెంకీల నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. గొప్ప కథేం కాకపోయినా… అందులోనూ ఇద్దరు అగ్రహీరోలు పండించిన హావభావాలు కుటుంబ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్నాయి. నాయక్ బీసీల భరతం పడుతోంటే… ‘సీతమ్మ… ‘ ఏ సెంటర్లలోనూ దుమ్ము దులుపుతోంది. ఓవర్సీస్ లో ‘సీతమ్మ..’ ఘనవిజయం సాధించింది. అక్కడ మాత్రం ‘నాయక్’ సోసోగా నడుస్తుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రూ. 45 కోట్లతో పూర్తయిందట. సన్ నెట్ వర్క్ రూ. 8.5కోట్లు వెచ్చించి హక్కుల్ని పొందింది. ఈ రెండు సినిమాలకూ కాస్త డివైడ్ టాక్ వినిపించినా.. సంక్రాంతికి మరో సినిమా లేకపోవడంతో మళ్ళీ నిలదొక్కుకొన్నాయి. మొత్తమ్మీద ‘నాయక్’, ’ సీతమ్మ’లు కలిసి దాదాపు రూ. 130 కోట్లు వసూళ్లు చేస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫ్రిబ్రవరిలోనూ ఈ జోరు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ‘ఒంగోలు గిత్త’, ’ మిర్చి’ సినిమాలు ఈనెలలోనే వస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలున్నాయి. రామ్-భాస్కర్ కలయికలో వస్తున్న ‘ఒంగోలు గిత్త’ పూర్తిగా మాస్ కథాంశం. ‘ఇది ఊర మాస్ లాంటి సినిమా’ అని రామ్ ముందే చెప్పేశారు. కుటుంబ బంధాలు, సున్నితమైన వినోదం జోడించడంలో భాస్కర్ ది అందివేసిన చేయి. ఈ మాస్ మసాలా కథని ఎలా డీల్ చేశాడో..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘మిర్చి’ ఘాటు చూపించడానికి ఫిబ్రవరి 7న ప్రభాస్ కూడా వచ్చేస్తున్నాడు. ప్రచార చిత్రాలూ, పాటలూ ప్రభాస్ అభిమానులకు ఇప్పటి కే కిక్ ఎక్కించేశాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అనుష్క, రిచాలు కథానాయికలు. ‘బిల్లా’లో అదరగొట్టిన ప్రభాస్-అనుష్కల జోడీ ఈ సినిమాలో మరింత కనువిందు చేయనున్నారు. ‘ఒంగోలు గిత్త’, ‘మిర్చి’ సినిమా మార్కెట్ కూడా బాగా జరిగిందని సమాచారం. ‘మిర్చి’ అయితే మంచి రేటు పలుకుతోంది. అన్ని ఏరియాల నుంచీ ‘మిర్చి’ హక్కుల్ని పొందడానికి పంపిణీదారులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రెండు సినిమాలూ దాదాపు రూ. 60 నుంచి 70 కోట్ల మార్కెట్ చేస్తాయని అంచనా. అదే నిజమైతే ఫిబ్రవరిలోనూ పండగే!