Site icon TeluguMirchi.com

న‌రేష్ … ఓవర్ యాక్షన్ త్రీడి

Allari-Nareshన‌రేష్ సినిమా అంటే న‌వ్వులు గ్యారెంటీ. అటు ప్రేక్షకుల‌తో పాటు, ఇటు నిర్మాత‌ల‌కు కూడా. ఎందుకంటే న‌రేష్ అంద‌రికీ అందుబాటులో ఉన్న హీరో! అత‌ని సినిమా అంటే బండి సేఫ్ అనే భ‌రోసా ఉంది. అందుకే చాలాకాలం మినిమం గ్యారెంటీ హీరోగా చెలామ‌ణి అయ్యాడు. చిన్న నిర్మాత‌ల దృష్టిలో పెద్ద హీరోగా మారాడు. దాంతో అవ‌కాశాలు వ‌రుస కట్టాయి. సినిమా త‌ర‌వాత సినిమా నుంచి – సినిమా ఉండ‌గానే మ‌రో రెండు సినిమాలు అనే స్థాయికి ఎదిగాడు. యేడాదికి క‌నీసం నాలుగు సినిమాలు. ప్రతీ సీజ‌న్‌లోనూ ఓ సినిమా… ఇలా న‌రేష్ బండి న‌ల్లేరు మీద న‌డ‌క‌లా సాగింది. దాంతో ఒక్కసారిగా పెద్ద హీరో అయిపోయానేమో – అనుకొన్నాడు న‌రేష్‌. రెమ్యున‌రేషన్ పెంచాడు. దాంతో పాటు అత‌ని సినిమాల బ‌డ్జెట్ కూడా పెరిగింది. క్రమంగా చిన్న నిర్మాత‌ల చేతుల్లోంచి చేజారిపోతున్నాడు న‌రేష్‌.

మార్కెట్‌ని బ‌ట్టే డిమాండ్‌, డిమాండ్‌ని బ‌ట్టే రెమ్యున‌రేష‌న్ అనే లెక్కల్లో ఎలాంటి త‌ప్పు లేదు. క్రేజ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకోవాలి అనుకోవ‌డంలో పొర‌పాటూ కాదు. అయితే రెమ్యున‌రేష‌న్ పెంచిన రేంజులో నిర్మాత‌ల‌కు లాభాలొస్తున్నాయా? ఇది వ‌ర‌క‌టిలా త‌న సినిమా సేఫ్ జోన‌ర్లో ఉందా? లేదా? అనే విష‌యాలు ఆలోచించ‌డం మ‌ర్చిపోయాడు. గుడ్డిగా దూసుకుపోతున్నాడు త‌ప్ప. ఆ సినిమాల వ‌ల్ల త‌న‌కేంటి లాభం? త‌న నిర్మాత‌కు ఏంటి ప్రయోజ‌నం? అనే విష‌యాల‌పై దృష్టి పెట్టడం లేదు. డ‌బ్బులొస్తున్నాయి క‌దా అని ఏ సినిమా ప‌డితే అది చేసేసి త‌న కెరీర్‌ని తానే పాడుచేసుకొంటున్నాడు.

సుడిగాడు మిన‌హాయిస్తే ఈమధ్య కాలంలో న‌రేష్ సినిమాలేవీ సరిగా ఆడ‌లేదు. సీమ‌ట‌పాకాయ్‌, మ‌డ‌తకాజా, నువ్వానేనా, య‌ముడికి మొగుడు… ఇలా అన్నీ ఫ్లాపులే. ఇప్పుడు యాక్షన్ త్రీడీ కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. ఒక్క హిట్టుతో త‌న రెమ్యున‌రేష‌న్ డ‌బుల్ చేసిన న‌రేష్‌…. ఇప్పుడు స‌గానికి స‌గం త‌గ్గించుకొంటాడా అంటే అదీ లేదు. ఓ మెట్టు దిగితే, నిర్మాత‌ల ముందు చుల‌క‌నైపోతానేమో అనే భ‌యం త‌న‌ది. క‌థ‌ల ఎంపిక‌లో న‌రేష్ పూర్తిగా బోల్తా ప‌డుతున్నాడ‌నే విష‌యం ఈ పరాజ‌యాలే చెబుతున్నాయి. ప‌రిశ్రమ‌లో ఇంత అనుభవం ఉండి, ఓ ద‌ర్శకుడి త‌న‌యుడు అయ్యిండి, ద‌ర్శక‌త్వంలో ప్రవేశం కూడా ఉండి.. ఏ క‌థ త‌న‌కు నప్పుతుందో, ఏది లేదో తెలుసుకొనే ప‌రిస్థితుల్లో ఉన్నాడు న‌రేష్. న‌టుడిగా ప్రతి సినిమాలోనూ త‌న వంతు న్యాయం చేసినా స‌త్ఫలితాలు రావ‌డం లేదంటే అది క‌థ‌లో ఉన్న లోపాలే. న‌రేష్ టైమ్‌కి షూటింగ్ కి రాడు, ద‌ర్శక‌త్వం విష‌యంలో జోక్యం చేసుకొంటాడు.. అనే అప‌వాదూ అతనిపై ఉంది. అందుకే కొంత‌మంది నిర్మాతలు, ఇంకోంత‌మంది ద‌ర్శకులు న‌రేష్ జోలికి వెళ్లడానికి వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. ముందు ఇవ‌న్నీ కేవ‌లం అభూత క‌ల్పనే అని చెప్పడానికైనా నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉండాలి.

యాక్షన్ త్రీడీ ఫ్లాప్‌తో అయినా న‌రేష్ దిగిరావాలి. త‌ప్పు ఎక్కడ జ‌రుగుతుందో ఒక‌టికి ప‌దిసార్లు చెక్ చేసుకోవాలి. ఈ అల్లరోడు మ‌ళ్లీ గాడిలో ప‌డాలి. ఎందుకంటే ప‌రిశ్రమ‌కు న‌రేష్ లాంటి హీరోలు కావాలి. ఎప్పుడూ చేతినిండా సినిమాల‌తో క‌ళ‌క‌ళ‌లాడే హీరోలుంటే, ప‌రిశ్రమ ప‌చ్చగా ఉంఉటంది. అది జ‌ర‌గాలంటే న‌రేష్ ప‌రేషాన్ ప‌డ‌కుండా, ఇప్పటికైనా మేలుకోవాలి. కెవ్వు కేక‌..తో మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాలి.

Exit mobile version