నాగార్జున చాలా నమ్మకం పెట్టుకుని కష్టపటి నటించిన చిత్రం ‘మన్మధుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ సినిమా హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా నాగార్జునకు నష్టం మిగిల్చింది. ఆ చిత్రం ఫలితం నేపథ్యంలో నాగార్జున తదుపరి చిత్రాల విషయంలో ఆలోచనలో పడ్డాడు. ఇకపై పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట. బంగార్రాజు సినిమాను చేయాలా వద్దా అని భావిస్తున్న నాగార్జున మన్మధుడు 2 ఫ్లాప్‌తో వెంటనే చేసేందుకు రెడీ అవుతున్నాడు.
బిగ్‌బాస్ పూర్తి అయిన తర్వాత నాగార్జున సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున అక్టోబర్ రెండవ వారం నుండి ‘బంగార్రాజు’ చిత్రంను పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రంను కూడా స్వయంగా తానే నిర్మించేందుకు నాగార్జున సిద్దం అవుతున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రంకు ఇది ప్రీ క్వెల్ అంటూ సమాచారం అందుతోంది. బంగార్రాజు పాత్రను హైలైట్ చేసి ఈ చిత్రంను చేయనున్నారు. అక్కినేని హీరో నాగచైతన్య కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. బంగార్రాజు చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నాగార్జున చాలా పట్టుదలతో ఉన్నాడు.