ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ అనగానే వెంటనే గుర్తుకువచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు. ఈ సీరియల్స్ లో నటించిన నటులకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్లోని ధర్మ, సత్య, దయ, శాంతి, కీర్తన పాత్రలు ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మొగలిరేకులు సీరియల్లో నటించిన దయ అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్ స్టా ద్వారా తెలిపారు. దీంతో అసలు దయ కి ఏమైంది?ఎలా చనిపోయారు? ఎప్పుడు జరిగింది? అంటూ అతని మృతి పట్ల అభిమానులతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
“పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైనవాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధం అయితే బాగుండని ఆశపడ్డాను.. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణయించుకోలేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి” అంటూ ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్ స్టా లో పోస్ట్ చేసారు.
అయితే పవిత్రనాథ్ ఎలా చనిపోయారన్నది మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఇదిలా ఉంటే, గతంలో పవిత్రనాథ్ పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. జాతకం పేరుతో అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకువచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని చెప్పింది. అంతేకాక తనతో వివాహం అయిన తర్వాత కూడా ఓ అమ్మాయితో 8 ఏళ్ల పాటు సంబంధం పెట్టుకుని తనను మోసం చేశాడని శశిరేఖ ఆరోపించింది. ప్రతి రోజు తాగొచ్చి టార్చర్ పెట్టేవాడని వెల్లడించింది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.