Site icon TeluguMirchi.com

హ్యాపీ బర్త్‌డే టూ మెగా స్టార్‌!!

chiranjeeviచిరంజీవి… ఇది పేరు కాదు. ఓ చరిత్ర. తెలుగు సినిమాకి స‌రికొత్త ర‌క్తం ఇచ్చిన – ఘ‌న‌త‌.
కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతారు.. చిరంజీవుల‌వుతారు అన‌డానికి చిరు జీవిత‌మే నిలువెత్తు నిద‌ర్శనం.
ఎక్కడి మొగ‌ల్తూరు, ఎక్కడి చెన్నై….? అంచెలంచెలుగా ఎదిగి, త‌న నెంబ‌ర్ వ‌న్ సౌధానికి ఒకొక్క మెట్టూ పేర్చుకొని – స్వయం కృషితో ఎదిగి – బాక్సాఫీసు బాక్స్ బ‌ద్దల కొట్టే గ్యాంగ్ లీడ‌ర్‌గా ఎదిగాడు, ఘ‌రానా మొగుడ‌య్యాడు. విజ‌యాలు చిరు ప్రతిభ‌కు స‌లామ్ కొట్టాయి, రికార్డులు దాసోహం అన్నాయి. అత‌ని డాన్స్ చూడాల‌ని.. థియేట‌ర్ల ముందు జ‌నం క్యూ క‌ట్టారు. ఫైటింగులు, డైలాగుల‌తో ప‌ర‌వ‌శించిపోయారు. ఎన్టీఆర్ త‌ర‌వాత అంత‌టి క్రేజ్‌నీ, అభిమాన గ‌ణాన్నీ సంపాదించుకొన్న తెలుగు హీరో – ఒక్క చిరంజీవే అన‌డం ఎంత మాత్రం అతిశ‌యోక్తి కాదు. ఖైది నుంచి మొద‌లైన అత‌ని నెంబ‌ర్ వ‌న్ ప‌రుగు… నిర్విగ్నంగా కొన‌సాగుతూనే ఉంది. త‌రాలు మారినా, కొత్త హీరోలొచ్చినా టాలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్‌.. చిరునే అనే స్థాయికి చేరారు.. చిరు.

చిరంజీవిని కేవ‌లం మాస్ హీరోగా మాత్రమే చూళ్లేం. ఇంత ఇమేజ్ పెట్టుకొని… వాటికి ఎదురీదే సాహ‌సాలు చేశారు. చిరు అంటే మాస్, క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లే అనుకొంటున్న రోజుల్లో – స్వయంకృషిలాంటి సినిమా తీయ‌డానికి ఎన్ని గట్స్ ఉండాలి? చంట‌బ్బాయ్‌లా న‌వ్వించే పాత్రలు ఎంచుకోవ‌డం వెనుక ఎంత గుండెనిబ్బరం ఉండాలి? రుద్రవీణ‌, ఆప‌ద్భాంధ‌వుడు…. ఇలా త‌న‌లోని న‌టుడిని బ‌య‌ట పెట్టడానికి రూటు మార్చిన సంద‌ర్భాలు కోకొల్లలు. చిరంజీవి రాజ‌కీయ రంగ ప్రవేశం చేయ‌డం వల్ల‌.. ఎంత ప్రజాసేవ జ‌రిగిందో, ఎంత‌మంది లాభ‌ప‌డ్డారో తెలీదు గానీ, తెలుగు చిత్రసీమ మాత్రం చాలా న‌ష్టపోయింది. క‌నుసైగతో, చిన్న చిరు న‌వ్వుతో బాక్సాఫీసుని బ‌ద్దలు కొట్టే హీరో దూర‌మ‌య్యాడు. అత‌ను మ‌ళ్లీ రావాల‌ని, రికార్డులు సృష్టించాల‌ని అభిమానులు ఆరేళ్లుగా ఎదురుచూస్తున్నారు. క‌నీసం 150వ సినిమా అయినా పూర్తి చేయాల‌ని వారి ఆశ‌. మ‌రి చిరు వారి మాట‌కు విలువ ఇస్తాడా? 150వ సినిమా పూర్తి చేసి రౌండ్ ఫిగ‌ర్ చేరుకొంటే అంత‌కంటే ఆనందం ఇంకేముంది..? ఆరోజు ఈ యేడాదైనా వ‌స్తుందేమో అని క‌ల‌లు కంటూ… మ‌న మెగాస్టార్ కి హ్యాపీ బ‌ర్త్‌డే చెప్పుకొంటూ….

Exit mobile version