ఈ వేస‌వి మెగా హీరోల‌దేనా?!

mega
వేస‌విలో మెగా హీరోల హంగామా కాస్త ఎక్క‌వుగానే క‌నిపిస్తోంది. రామ్ చ‌రణ్ ఒక్క‌డే లేడు. మిగిలిన వాళ్లంతా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి రెడీ అయిపోతున్నారు. ఈ శుక్ర‌వారం రేసుగుర్రం విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపై బ‌న్నీ చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. క‌చ్చితంగా హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాడు. ట్రైట‌ర్లు, పాట‌లు కూడా అంచ‌నాలు పెంచేస్తున్నాయి. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో ఫ్లాప్‌..తో కాస్త వెన‌క‌డుగు వేసిన స్టైలీష్ స్టార్‌.. ఈసారి ఏం చేస్తాడో..??

అన్న వెళ్లిన కొన్ని రోజుల‌కే త‌మ్ముడు అల్లు శిరీష్ కూడా వ‌చ్చేస్తాడు. కొత్త జంట సినిమాతో. గౌరవం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శిరీష్‌కి ఆ సినిమా చేదు అనుభ‌వం మిగిల్చింది. సొంత బ్యాన‌ర్‌లో సినిమా, పైగా మారుతి లాంటి టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు తోడు కావ‌డంతో ఈసారి ఎలాగైనా శిరీష్ త‌న‌ని తాను నిరూపించుకోవ‌డం ఖాయ‌మ‌ని మెగా ఫ్యాన్స్ న‌మ్మ‌కాలు పెట్టుకొన్నారు. ఇక ఎప్ప‌టి నుంచో వ‌స్తా, వ‌స్తా అని ఊరిస్తున్న రేయ్‌.. ఈ వేస‌విలోనే రానుంది. మే 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్ డాన్సులు ఇర‌గ‌దీశాడ‌ని చిత్ర‌వ‌ర్గాలు చెబుతున్నాయి. వైవిఎస్ చౌద‌రికీ ఇది ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం. అందుకే ఈ సినిమాని హిట్ చేయ‌డానికి ఆయ‌న కూడా శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. మొత్తానికి ఈ స‌మ్మ‌ర్‌లో మెగా హీరోలు హంగామా చేయ‌నున్నారు. వారిలో ప్రేక్ష‌కులు ఎవ‌రి జోరుకు ఎక్కువ ఓట్లు వేస్తారో చూడాలి.