Manchu Family : టాలీవుడ్‌లో మరోసారి మంచు ఫ్యామిలీ అంతర్గత కలహాలు బహిరంగంగా మారాయి. ప్రముఖ నటుడు మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు పుట్టినరోజు కోసం రాజస్థాన్ వెళ్లిన సమయంలో, జల్‌పల్లిలోని తన ఇంట్లో దాదాపు 150 మంది చొరబడి గోడలు దూకి వచ్చి విలువైన వస్తువులను ధ్వంసం చేశారని, కార్లు మరియు ఇతర ఆస్తులను ఎత్తుకెళ్లారని మనోజ్ ఆరోపించారు. చోరీకి గురైన కార్లు మంచు విష్ణు ఆఫీసులో లభ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో ఈ విధ్వంసం జరిగిందని, బాధితుడిగా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు.
ఈ పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన స్పందించలేదని మనోజ్ వాపోయారు. “నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై చెప్పాలనుకున్నా, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు,” అని తెలిపారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం కోరుతున్నట్టు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. గతంలోనూ మంచు ఫ్యామిలీలో అభిప్రాయ భేధాలు కనిపించినా, ఈసారి పరిస్థితి తీవ్రంగా మారినట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వివాదం ఎలా పరిష్కారం కుదురుతుందన్నది ఆసక్తికరంగా మారింది.