వేలంటైన్స్ డే కానుక‌గా ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ `ల‌వ‌ర్స్ డే` చిత్రం


అమ్మాయి ఓర‌చూపు చూస్తే వ‌ల‌లో ప‌డ‌ని అబ్బాయిలు ఉండ‌ర‌ని అంటారు. మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ విష‌యంలో అది మ‌రోసారి రుజువైంది. కాక‌పోతే ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ మ‌రో అడుగు ముందుకేశారు. ఆమె కొంటెగా కంటి సైగ చేస్తే రాష్ట్రాల స‌రిహ‌ద్దులు దాటి మ‌రీ యువ‌కులు ఆమె గురించి ఆరా తీశారు. కేవ‌లం 27 సెక‌న్ల వీడియోతో యావ‌త్ భార‌త‌దేశాన్ని ఉర్రూత‌లూగించిన సొగ‌స‌రి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. యువ‌కుల్లో అంత‌టి క్రేజ్‌ను సంపాదించుకున్న ప్రియా న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `ఒరు ఆధార్ ల‌వ్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో `ల‌వ‌ర్స్ డే` పేరుతో సుఖీభ‌వ సినిమాస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి నిర్మాత‌లు. ఒమ‌ర్ లులు ద‌ర్శ‌కుడు.

ఈ సినిమా గురించి నిర్మాత‌లు ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి మాట్లాడుతూ “ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టించిన `ఒరు ఆధార్ ల‌వ్‌` గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ ప‌రిచ‌యం చేయ‌క్క‌ర్లేదు. ప్రియా చేసిన ఒక్క కంటి సైగ‌తో ఆ సినిమాకు వ‌చ్చిన క్రేజ్ అంత గొప్ప‌ది. ఆ చిత్రం తెలుగు హ‌క్కుల కోసం చాలా మంది ప్ర‌య‌త్నించారు. భారీ పోటీ మ‌ధ్య హ‌క్కుల‌ను మేం ద‌క్కించుకున్నాం.

వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న తెలుగులో `ల‌వ‌ర్స్ డే` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నాం. 2018లో గూగుల్‌లో టాప్‌లో ట్రెండింగ్‌లో ఉన్న అమ్మాయి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. త‌న క‌నుసైగ‌తో ఆమె చేసిన మాయ అంత గొప్ప‌ది. తెలుగులోనూ ఆ అమ్మాయికి విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ప్రియాని హీరోయిన్‌గా పెట్టి తెలుగులో సినిమా చేయ‌డానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలా ప్రతి సామాజిక మాధ్య‌మంలోనూ ఆమె పేరును జ‌పించే వారి సంఖ్య అత్య‌ధికం.

`ఒరు ఆధార్ ల‌వ్‌`లో కేవ‌లం 27 సెక‌న్ల పాటు ఆమె చేసిన క‌నుసైగ‌కు రెండు రోజుల్లోనే 45 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఇప్ప‌టికి రెండు కోట్ల మంది ఆ వీడియో చూశారు. అంత క్రేజీ ప్రాజెక్ట్ ను మేం తెలుగులో విడుద‌ల చేస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. హై స్కూలు చ‌దివే ఇద్ద‌రి మ‌ధ్య రొమాన్స్ ను చెబుతుంది. షాన్ రెహ‌మాన్ సంగీతం హైలైట్ అవుతుంది“ అని అన్నారు.

న‌టీన‌టులు
నూరిన్ షెరిఫ్‌, రోష‌న్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, మైఖేల్ యాన్ డేనియ‌ల్‌, దిల్‌రూపా, హ‌రీష్ పెరుమ‌న్న‌, అనీష్ జి మీన‌న్‌, షాన్ సాయి, అర్జున్ హ‌రికుమార్‌, అతుల్ గోపాల్‌, రోష్న అన్‌రాయ్ త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు
కెమెరా : శీను సిద్ధార్థ్‌
ఎడిటింగ్‌: అచ్చు విజ‌య‌న్‌
సంగీతం: షాన్ రెహ‌మాన్‌
స్క్రీన్‌ప్లే: సారంగ్ జ‌య‌ప్ర‌కాష్‌, లిజో ప‌నాడా
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఒమ‌ర్ లులు
నిర్మాత‌లు: ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి