హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ సెటిల్ అయ్యింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తెలుగు సినిమా పరిశ్రమను తరలించేందుకు కొందరు ప్రయత్నాలు చేశారు. కాని ప్రముఖులు ఎవరు కూడా హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే చిన్నా చితకా స్టూడియోలను అక్కడ నిర్మించేందుకు ఒక్కరు ఇద్దరు నిర్మాతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీలో అదీ గుంటూరు జిల్లాలో ప్రముఖ రచయిత కోన వెంకట్ హాలీవుడ్ స్థాయి స్టూడియో నిర్మాణంకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అమెరికాలోని డిస్నీల్యాండ్ థీమ్ పార్క్ తరహాలో గుంటూరు జిల్లా సూర్యలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అందుకోసం ఏపీ ప్రభుత్వం మరియు హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్పీల్యాండ్‌తో చర్చలు జరపాలని భావిస్తున్నాడు. తాను కూడా కొంత మొత్తంలో పెట్టుబడులను పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. దాదాపుగా 500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. సినిమాల షూటింగ్‌లతో పాటు పర్యాటక ప్రాంతంగా కూడా అది ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.