పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కాటమరాయుడు’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం దుమ్ము దుమ్ముగా వస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో సినిమా లేదు అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాతో 100 కోట్లు కష్టమే అంటున్నారు. అయితే ఈ ఫలితాన్ని నిర్మాత సురేష్‌బాబు ముందే ఊహించాడు అంటూ టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
పవన్ నటించిన ఈ సినిమా వారం రోజులు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సందడి కొనసాగుతుందని, ఆ తర్వాత పెద్దగా ప్రభావం ఉండదని భావించి తన సోదరుడు వెంకటేష్ నటించిన ‘గురు’ చిత్రాన్ని ఈనెల 31కి ఫిక్స్ చేయడం జరిగింది.
‘కాటమరాయుడు’ సూపర్ హిట్ అయితే ‘గురు’ ఆ తేదీకి వస్తే భారీ నష్టం వచ్చేది. అయితే సినిమాకు టాక్ విభిన్నంగా ఉండటంతో మొదటి వారం తర్వాత పెద్దగా ప్రేక్షకులు ఉండరని ఆయన భావించి 31కి ఫైనల్ చేయడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో సురేష్‌బాబు తర్వాతే మరెవ్వరైనా అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ‘గురు’ చిత్రంతో పాటు ‘రోగ్’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.