పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఉగాది కానుకగా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు దర్శకుడు డాలీ అనగానే సినిమాపై ప్రేక్షకులు మొదట అంచనాలు పెట్టుకోలేదు. కాని మెల్ల మెల్లగా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్ మరియు ఇతర అంశాల కారణంగా భారీ క్రేజ్ దక్కింది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాత శరత్ మరార్ ఈ సినిమాను అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయి మొత్తానికి అమ్మేశాడు. ఇక ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ పారితోషికం రికార్డు అంటూ ప్రచారం జరుగుతుంది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పారితోషికంగా నైజాం మరియు ఓవర్సీస్ రైట్స్‌ను అందుకున్నాడు. ఆ రెండు రైట్స్ రూపంలో ఏకంగా 33.5 కోట్లు పవన్‌కు పారితోషికంగా అందినట్లుగా తెలుస్తోంది. పవన్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో నైజాం ఏరియాలో కాటమరాయుడు ఏకంగా 25 కోట్లకు అమ్ముడు పోయింది. ఇక ఓవర్సీస్‌లో 8.5 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తానికి పవన్ సర్దార్ గబ్బర్‌సింగ్‌కు పెద్దగా లాభం దక్కలేదు. అయితే ఈ సినిమాతో మాత్రం భారీగా లాభం సాధించాడు. సర్దార్ సినిమాలో నిర్మాణ బాధ్యతను పవన్ తీసుకున్నాడు. అయితే ఈ సినిమాకు ఎలాంటి నిర్మాణ బాధ్యత తీసుకోలేదు. తక్కువ బడ్జెట్‌తోనే ఈ సినిమాను డాలీ చుట్టేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంతో నిర్మాత శరత్ మరార్‌కు కూడా విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కినట్లుగా చెబుతున్నారు.