మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కన్నప్పకి సంబంధించి తాజా ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ పౌరాణిక చిత్రం, విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా పడింది. అప్పటి నుంచి కొత్త విడుదల తేదీపై సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో, తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను విష్ణు, మోహన్ బాబు, ప్రభుదేవా కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి విగ్రహాన్ని ముఖ్యమంత్రికి బహుమతిగా అందజేయడమేగాక, సినిమా కొత్త విడుదల తేదీ అయిన జూన్ 27, 2025ను అధికారికంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రిలీజ్ డేట్ పోస్టర్ ఆవిష్కరించడం విశేషం. త్వరలోనే సినిమా ప్రమోషన్లు జోరుగా జరుగనున్నాయని విష్ణు తెలిపారు.
ఇదిలా ఉండగా, మరోవైపు మంచు మనోజ్ – విష్ణు మధ్య జరుగుతున్న కుటుంబ కలహం కూడా వార్తల్లో నిలుస్తోంది. జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద మనోజ్ ధర్నా చేయడం, విష్ణుపై వస్తువులు తీసుకెళ్లాడంటూ కేసు పెట్టడం వంటి ఘటనలు ఒకవైపు ఉండగా, మరోవైపు విష్ణు మాత్రం తన సినిమా ప్రచారంపై దృష్టి సారించడం గమనార్హం. కన్నప్ప చిత్రంలో విష్ణు ప్రధాన పాత్రలో నటించగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చింది.