సినిమాలకు బై చెప్పేసిన కమల్ హాసన్

‘లోకనాయకుడు’ కమల్‌హాసన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన నటనతో యావత్‌ భారతీయ సినీ ప్రేక్షక లోకాన్నీ ఆకట్టుకున్న కమల్ ఇక సినిమాలకు స్వస్తి చెప్పారు. త్వరలో పార్టీని స్థాపించి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ఇప్పటికే కమల్‌హాసన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాలకూ స్వస్తి పలకనున్నారట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు.

‘‘ఇక నా నుంచి రెండు సినిమాలు మాత్రమే వస్తాయి. ఆ తర్వాత నా సినిమాలు రావు. నిజాయతీతో జీవిస్తూ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా. కానీ, ఓడిపోతానన్న ఆలోచనే లేదు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధంలేదు. నాకు ఒక సైన్యం ఉంది. ఇంకా చాలా మంది నా వెంట నడుస్తారనే నమ్మకం ఉంది. ఇంక ప్రజల్లో వుండి సేవ చేసుకోవడమే నా జీవిత లక్ష్యం” అని చెప్పుకొచ్చారు కమల్.