Jr NTR : తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్..


Jr NTR : రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు సర్వం కోల్పోయి, ఆకలిదప్పులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాల తరపున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుండి పలువురు సినీ సెలబ్రిటీలు ఏపీ, తెలంగాణకు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ వరద భాదితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

“రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను” అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. ఎన్టీఆర్ వీరాభిమాని విశ్వక్ సేన్ సైతం రెండు రాష్ట్రాలకు చెరో 5 లక్షల చొప్పున మొత్తం పది లక్షలు విరాళంగా ప్రకటించారు.

అలాగే వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇక ‘ఆయ్’ చిత్రబృందం కూడా ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా నిలిచింది. సోమవారం నుండి వారాంతం వరకు వచ్చే ‘ఆయ్’ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ ప్రకటించారు.