‘జై లవకుశ’ ఎవరి కోరికంటే..!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బాబీ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘జై లవకుశ’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక అభిమానుల సమక్షంలో భారీగా జరిగింది. ఈ వేడుకలో నందమూరి అన్నదమ్ములు కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌లతో పాటు వారి తండ్రి అయిన హరికృష్ణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరికృష్ణ మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. జై లవకుశ సినిమా బీజం ఎక్కడ, ఎవరు వేయడం జరిగింది అనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు.

హరికృష్ణ మాట్లాడుతూ.. ఒక రోజు కళ్యాణ్‌ రామ్‌, జానకిరామ్‌ మాట్లాడుకుంటూ తాతగారి పేరుమీద బ్యానర్‌ పెట్టాం. అందుకు తగ్గట్లుగా సినిమాలు చేయాలి. అందుకే ఆయన పేరు పెట్టుకున్న తమ్ముడిని హీరోగా పెట్టి ఒక ప్రతిష్టాత్మక సినిమాను నిర్మిస్తే అప్పుడు బ్యానర్‌కు సార్థకత వస్తుందని అన్నారు. అదే విషయాన్ని కళ్యాణ్‌ రామ్‌ ఆలోచించి జూనియర్‌తో చెప్పడం, వెంటనే జూనియర్‌ కూడా ఓకే చెప్పడంతో ఈ సినిమా వచ్చిందని హరికృష్ణ చెప్పుకొచ్చారు.

దసరా సందర్బంగా ఈ సినిమాను ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు కనిపించబోతున్నారు. ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ఒక మరిచిపోలేని సినిమాగా ఉంటుందని సినీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ అంటున్నారు.