బసిరెడ్డి మాటలకు నందమూరి ఫ్యాన్స్ ఫిదా..

జగపతి బాబు..ఈ పేరు ప్రస్తుతం అన్ని భాషల్లో మారుమోగిపోతుంది. హీరోగా సినిమాలు చేసినప్పుడు రాని గుర్తింపు , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు వస్తుంది. ఈయన కోసం టాప్ డైరెక్టర్స్ , హీరోస్ ఎదురుచూస్తున్నారంటే ఈయన రేంజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఈయన ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత లో బాసిరెడ్డి పాత్రలో నటించి అదరగొట్టాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు జగపతి నటన గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు.

ఇక ఆదివారం జరిగిన చిత్ర సక్సెస్ మీట్ లో ఈయన మాట్లాడిన తీరు నందమూరి ఆబొమానులను ఫిదా చేసాయి. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘2010లో నా కెరీర్ ఆగిపోయిందని అనుకున్నా. 2012లో బాలయ్య బాబుతో ‘లెజెండ్’లో జితెంద్ర పాత్రతో మళ్లీ బిజీగా మారిపోయాను. బాలయ్య, తారక్‌లో నాకు ఒకే లక్షణం కనిపించింది. వీరిద్దరు నాకు తెలియకుండా ఒక మంచి పనిచేశారు. తారక్‌తో మాట్లాడినప్పుడు నాకు కొన్ని మంచి విషయాలు తెలిశాయి. వాటిని బయటకు చెప్పలేను. ‘నాన్నకు ప్రేమతో’ చేసినప్పుడు.. తారక్‌కు నాకు మధ్య చిన్న చర్చ వచ్చింది. తారక్.. నిన్ను, బాలయ్యను ఒకే వేదికపై చూడాలని ఉందని అన్నాను. దీనిపై తారక్ స్పందిస్తూ.. ఆయన మా బాబాయ్. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం అన్నాడు. సాధారణంగా నేను ఏ హీరోలతో ఇలా ఫొటోలు దిగను. కానీ, వీరిద్దరితో ఫొటో దిగాను. నందమూరి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ. ఈ వేదికపై అసలైన దసరా, దీపావళి పండగలను చూస్తున్నాం’’ అని జగపతిబాబు తెలిపాడు. జగపతి మాటలకు వేడుకలో ఉన్న అభిమానులే కాదు కార్య క్రమం చూస్తున్న వారు సైతం ఫిదా అయ్యారు.