’తుఫాన్’ తీరం దాటేనా??

toofanఇప్పడు అంద‌రి క‌ళ్లూ తుఫాన్ మీదే. సినిమా ఆడుదుందా? లేదా? అని కాదు. బొమ్మ ప‌డుతుందా? జ‌నాలు చూస్తారా? అనేదే అస‌లు సిస‌లైన సందేహం. కార‌ణం ఒక్కటే రాష్ట్ర్రం భ‌గ‌భ‌గ మండుతోంది. సీమాంధ్రలో రోజుకి రెండు ఆట‌లే ప్రద‌ర్శిస్తున్నారు. మార్నింగ్ షో, మ్యాట్నీలు ఉద్యమ ధాటికి ఎగిరిపోతున్నాయి. చిన్న సినిమాల‌కు డ‌బ్బులు రావాలంటే ఫ‌స్ట్ షో, సెకండ్ షో చాలు. కానీ తుఫాన్ లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు నాలుగు ఆట‌లు ప‌డాల్సిందే.

మెగా హీరోల‌కు ఉన్న ఫాలోయింగ్ తెలియంది కాదు. జ‌నాలు క్యూలో నిల‌బ‌డ‌తారు. బ్లాక్ టికెట్ల కోసం ఎగ‌బ‌డ‌తారు. అయితే.. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. సీమాంధ్ర ఉద్యమ ప్రభావానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌నే సైడ్ అయిపోయ‌డు. అలాంటిది ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్ ధైర్యంగా ముందుకు దిగుతున్నాడు. ఈ సినిమాని సీమాంధ్ర జ‌నాలు కాస్త ప‌ర్సన‌ల్‌గా తీసుకొనే అవ‌కాశాలున్నాయి. ఈ సినిమాని అడ్డుకొని తీర‌తాం అంటున్నారు. అదే గ‌నుక జరిగితే ఈ సినిమాకు భారీ న‌ష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మ‌రోవైపు నిర్మాత‌ల ఆందోళ‌న కూడా అదే. చ‌ర‌ణ్‌ని తీసుకొంటే టాలీవుడ్ క‌లక్షన్లు దుమ్ము రేగేలా ఉంటాయ‌ని నిర్మాత‌లు భావించారు. ఇప్పుడు అది కూడా పాయె. ఇటు నైజాంలోనూ ఈ సినిమాని భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇంచుమించు ప్రతి థియేట‌ర్‌లోనూ తుఫాన్ ని విడుద‌ల చేయ‌బోతున్నారు. నైజాం లో వ‌సూళ్లూ కీల‌కమే. అయినా ఇక్కడా చిరు అండ్ కోకి… నెగిటీవ్ వైబ్రేషన్స్ మొద‌లయ్యాయి. ఈ ద‌శ‌లో ఈ సినిమాకి రికార్డు క‌ల‌క్షన్లు ఆశించ‌డం అత్యాసే. సినిమా విడుద‌లైనా థియేట‌ర్లు నిండుతాయా? క‌నీసం సినిమా ఆడ‌నిస్తారా? సీమాంధ్రలో థియేట‌ర్ల ద‌గ్గర ఎలాంటి ప‌రిస్థితి ఉంటుంది? అనే టెన్షన్‌లో ఉన్నారంతా. సినిమాని సినిమాగానే చూస్తారా? చ‌ర‌ణ్‌కి ఉన్న ఫాలోయింగ్ తుఫాన్‌ని తీరం దాటిస్తుందా? అనేవి బిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నలు.