ప్రకాష్‌రాజ్‌.. ఏమిటీ మార్పూ??

prakash raj
ప్రకాష్‌రాజ్ గొప్ప న‌టుడే. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు. అందులో సందేహ‌మే అక్కర్లెద్దు. ఆయ‌న్ని ద‌ర్శకుల న‌టుడు… అంటుంటారంతా. అయితే తెర‌పై చూస్తున్న ప్రకాష్‌రాజ్ వేరు..  సెట్లో ప్రకాష్‌రాజ్ వేరు. సినిమా ప్రమోష‌న్లకు రాడు. మహా అయితే ఆడియో ఫంక్షన్లో క‌నిపిస్తాడంతే. క్రమ‌శిక్షణా రాహిత్యంతో అనేక‌సార్లు వివాదాల్లోకి ఎక్కాడు. మొన్నటికి మొన్న బ‌హిష్కర‌ణ‌.. అంచుల వ‌ర‌కూ వెళ్లొచ్చాడు. కానీ ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌ లో మార్పు స్పష్టంగా క‌నిపిస్తోంది. మొన్నటికి మొన్న అల్లుడు శీను ప్రెస్‌మీట్ లో ఆ సినిమా గురించి అన‌ర్గళంగా మాట్లాడాడు. నిన్న గీతాంజ‌లి ఆడియోలోనూ మెరిశాడు. నేను నిర్మాత‌ల‌కు స‌దా అందుబాటులో ఉంటా… అని చెప్పడానికి ఇవ‌న్నీ సంకేతాలుగా అనుకోవ‌చ్చా..??  నిర్మాత‌ల్ని ఇక ఇబ్బంది పెట్టకూడ‌ద‌ని ప్రకాష్‌రాజ్ నిర్ణయించుకొన్నాడా?  అలాగైతే మంచిదే క‌దా..!

చిత్ర సీమ‌లో ప‌రిస్థితులు ఇది వ‌ర‌క‌టిలా లేవు. ఎవ‌రైనా నెత్తికెక్కితే కింద‌కు దించ‌డానికి ఎవ్వరూ వెనుకంజ వేయ‌డం లేదు. పైగా ప్రకాష్‌రాజ్‌కి ఇప్పుడు ప్రత్యామ్నాయాలు సిద్దమ‌వుతున్నాయి. రావుర‌మేష్‌, రాజేంద్రప్రసాద్‌లాంటి వాళ్లు ప్రకాష్‌రాజ్ పాత్రల్ని భ‌ర్తీ చేయ‌డానికి రెడీ గా ఉన్నారు. పైగా ప్రకాష్‌రాజ్ కాల్షీట్లు చాలా ఖ‌రీదు. అడిగిందంతా ఇచ్చి, ప్రకాష్‌రాజ్ అడుగుల‌కు మ‌డుగులు ఒత్తడానికి ఎవ‌రూ సిద్దంగా లేరు. దానికి తోడు దర్శకుడిగా మారి తీసిన ఉల‌వ‌చారు బిరియానీ ఫ్లాప్ అయ్యింది. ఇక పూర్తిగా న‌ట‌న‌పైనే దృష్టి పెట్టక త‌ప్పని ప‌రిస్థితి. అందుకే ప్రకాష్‌రాజ్ కాస్త ప‌ట్టు స‌డ‌లించాడేమో అనిపిస్తుంది. అదే జ‌రిగితే…. నిర్మాత‌లు సంతోషిస్తారు కూడా. ఎందుకంటే ప్రకాష్‌రాజ్‌కి ఉన్న మైలేజీ అలాంటిది. అత‌ని ప్రతిభ అలాంటిది. కాస్త అహంకారాన్ని, దురుసునీ ప‌క్కన పెడితే అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది??