సాధారణంగా దర్శకుడు – నిర్మాత కలసి హీరోని వెతుక్కొంటారు. ఆయనకు కథ చెప్పి సినిమా ఓకే చేయించుకొంటారు. కానీ పవన్ కల్యాణ్ దగ్గర మాత్రం ఈ రూలు వర్తించదు. నిర్మాత పని పవన్ కల్షీట్లు దక్కించుకోవడం వరకే. దర్శకుడు, కథ, మిగిలిన నటీనటుల ఎంపిక అంతా పవన్ చేతుల్లోనే ఉంటుంది. పవన్ చెప్పిందానికి తలూపుతూ, అవసరమైన చోట డబ్బులు ఇవ్వడమే నిర్మాత చేయాల్సింది. ‘గబ్బర్ సింగ్’ విషయంలో అదే జరిగింది. ‘అత్తారింటికి దారేది’ కాంబినేషన్ సెట్ చేసిందీ ఆయనే. ఇప్పుడు ‘గబ్బర్ సింగ్ 2’ కూడా ఈ ఫార్ములా ప్రకారమే జరుగుతోంది. పీవీపీ సంస్థ సినిమా కూడా డీటోనే. అయితే ఈ ఫార్ములా ఎంత వరకూ సేఫ్? ఎవరికి లాభం?? అసలు ఇది కరెక్టేనా?? హీరోల గుత్తాధిపత్యానికి ఇది నిలువెత్తు నిదర్శనం కాదా..?? అనే ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయిప్పుడు.
అసలే హీరో చుట్టూ తిరిగే పరిశ్రమ ఇది. ఇదే ఫార్ములా ప్రతీ హీరో పాటిస్తే.. ఇక నిర్మాత, దర్శకుడు అనే మాటలకు విలువ ఉండదనేది కొంతమంది భయం. అయితే ఇంకొంతమంది మాత్రం.. మంచి సినిమాలు రావడానికి ఈ ఫార్ములానే కరెక్ట్ అంటున్నారు. తనకేం కథకావాలో, ఎలాంటి సినిమాలు చేస్తే అభిమానుల్ని సంతృప్తి పరచవచ్చో ఆ హీరోకే తెలుస్తుంది. తన బలాలూ, బలహీనతలకు అనుగుణంగా కథల్ని ఎంచుకోవచ్చు. అప్పుడు మినిమం గ్యారెంటీ సినిమాలొస్తాయి. పైగా పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోకి దర్శకుడిని ఎంచుకొనే సౌలభ్యం ఇవ్వడంలో తప్పులేదని కొంతమంది ఫీలింగ్. పవన్ సినిమాకి ఛాన్స్ అంటే ఎవరైనా సరే కష్టపడే పనిచేస్తారు. ఆ కసి పవన్‌కి కావాలి. అందుకే ఈ ఫార్ములా ఎంచుకొన్నాడని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
వర్కవుట్ అయ్యేంత వరకూ ఓకే! ఫ్లాప్ ఎదురైనప్పుడే తేడాలొస్తాయి. తనపై తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కూడా మంచిది కాదు. పవన్ కోసం కథలు రాసుకొని, పవన్ కోసం ఎదురుచూసే దర్శకులనూ పవన్ గుర్తిస్తే మంచిది.