Site icon TeluguMirchi.com

‘గబ్బర్ సింగ్’ని ‘నాయక్’ జయిస్తాడా?

nayak and gabbarsingఈ సంక్రాంతికి వినోదం పంచివ్వడానికి రెండు రోజుల ముందే వచ్చేశాడు ‘నాయక్’. తొలి రోజు టాక్ ఇలాగే కొనసాగితే ఈ సినిమా 2013లో తొలి విజయాన్ని నమోదు చేసుకొన్నట్టే. బుధ, గురు వారాల్లో దాదాపు రూ. 20 కోట్లు రాబట్టుకొంటుందని అంచనా. సంక్రాంతి సీజన్ కాబట్టి, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మినహా పోటీ లేదు కాబట్టి.. వసూళ్ల పరంగా ‘నాయక్’మరింత దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘నాయక్’కి రూ. 52 కోట్ల బడ్జెట్ అయ్యిందని తెలిసింది. దాదాపు అంతకు మార్కెట్ జరిగిపోయింది.

నైజాంలో ఈ సినిమా హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకొన్నారు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమానీ ఈయనే కొన్నారు. ఆ సినిమా వల్ల జరిగిన నష్టాన్ని నిర్మాత డి.వి.వి. దానయ్య భర్తీ చేయాలనుకొన్నారు. అందుకే నైజాం హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే దిల్ రాజుకి కట్టబెట్టారు. అలాగైనా సరే లెక్కల బట్టి చూస్తే ప్రస్తుతానికి నిర్మాత సేఫ్. అయితే ఈ వారాంతానికి ఎంత వస్తూళ్లు చేస్తుంది? అనేది ఆసక్తికరమైన విషయం. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి.. కనీసం రూ. 60 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు ఓ అంచనాకు వచ్చేశారు. ‘సీతమ్మ వాకిట్లో..’ పెద్దగా పోటీ ఇవ్వకపోతే ‘గబ్బర్ సింగ్’ దరిదాపుల్లోకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.

‘సీతమ్మ…’ వసూళ్లలో వాటాకి దిగకపోతే బాబాయ్ సినిమాని అబ్బాయ్ దాటేసే అవకాశాలూ ఉన్నాయి. ‘గబ్బర్ సింగ్’ దాదాపుగా రూ. 80 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకూ తెలుగు చిత్రసీమలో ఇదే రికార్డు. ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలొచ్చినా.. దేని వసూళ్లు దానివే అని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు. 11న ‘సీతమ్మ…’ ఎంత పెద్ద విజయం సాధించినా.. ‘నాయక్’ వసూళ్లకు పడే గండి ఏమీ ఉండదని, మరో రెండు సినిమాలు వచ్చినా జనం చూస్తారని సినీ అనుభవజ్ఞుల మాట. అదీ నిజమే… ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ హిట్టయి మంచి వసూళ్లు దక్కించుకొన్న సందర్భాలూ ఉన్నాయి. ‘నాయక్’ మాస్ సినిమా. ‘సీతమ్మ…’ ఫుల్ క్లాస్. సంక్రాంతి సీజన్ కి రెండూ అనువైన సినిమాలే. మరోవైపు ‘సీతమ్మ…’కీ మంచి రిపోర్ట్ వచ్చింది. ఆ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మల్టీస్టారర్ కూడా మెప్పిస్తే 2013కి ఘనమైన ప్రారంభం లభించినట్టే.

Exit mobile version