చెన్నై లో జరుగుతున్న వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలో ఆదివారం సాయంత్రం ఒక అపశ్రుతి దొర్లింది. ప్రముఖనటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి కి అవమానం జరిగింది. వేడుకల రెండవరోజయిన ఆదివారం నాడు పూర్తిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నిర్వాహకులు కేటాయించారు. ఈ వేడుకకు హైదరాబాద్ నుంచి పెద్దసంఖ్యలో పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ వేదికపై ఆర్. నారాయణమూర్తి ప్రసంగిస్తూ ” ఎంతో గౌరవంగా, హుందాగా నిర్వహించుకోవలసిన ఈ వేడుకను ఇలా ఐటెం సాంగులతో చాలా చీప్ గా నిర్వహిస్తున్నారు. వందేళ్ళ వేడుకలా లేదు. ఒక సినిమా ఆడియో వేడుకలా వుంది. నిర్వహణా ప్రాంగణానికి దక్షిణ భారత చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ రఘుపతి వెంకయ్య నాయుడు పేరు పెట్టాలి. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన వేడుకలో దాసరి నారాయనరావుకో, కె. విశ్వనాద్ కో, రాఘవేంద్రరావు కో, రామానాయుడు కో కాకుండా తమిళ దర్శకుడు బాలచందర్ కు అగ్రస్థానం ఇచ్చి సన్మానించడం మన దౌర్భాగ్యం. బాలచందర్ మహానుభావుడే. కాని మనవారిని మనం గౌరవించుకునే సంస్కారం మనకు వుండాలి కదా… ” అంటూ ఆవేశంగా అన్నారు. దీంతో కంగారు పడిన నిర్మాత, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ వేదికపైకి హడావిడిగా వచ్చి నారాయణమూర్తి చేతిలో వున్న మైకు లాగేసుకుని ఆయనను బలవంతంగా కిందికి పంపేశారు. నారాయణమూర్తి మాట్లాడిన మాటలు నూటికి నోరు పాళ్ళు వాస్తవమని, కాని నిర్వాహకులు వాటిని జీర్ణించుకోలేక పోయారని సభకు హాజరయిన దాదాపు అందరూ భావించారు.