మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు : విశ్వక్ సేన్


‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. ‘బాహుబలి’ చిత్రంలో సేతుపతి గుర్తింపు పొంది, 2019లో స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై హీరోగా రాకేశ్‌ వర్రే నటించిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ, ఆయన నిర్మించిన ‘పేక మేడలు’ చిత్రం టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విశ్వక్ సేన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “రాకేశ్‌ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఆ ప్లెజర్‌ చాలా ఆనందంగా ఉంటుంది. మన సంకల్పం గట్టిదైతే ఏదైనా సాధించవచ్చు. ఈ చిత్రం హీరో వినోద్‌ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్‌ అద్భుతంగా వున్నాయి. రాకేశ్‌కు ఆల్‌ ద బెస్ట్‌. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఇక చిత్రాల గురించి వస్తే.. నా రెండు చిత్రాల గురించి వచ్చేవారం నుంచి అప్‌డేట్స్‌ ఇస్తా. వాటితో పాటు ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఇస్తాను. ఇకపోతే తాజాగా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘బేబీ’ మూవీని దర్శకుడు సాయిరాజేష్ ముందుగా విశ్వక్ సేన్ తో చేయాలనుకున్నారని, కానీ విశ్వక్ కథ కూడా వినలేదని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేస్తూ విశ్వక్ సేన్ ఈవిధంగా మాట్లాడారు.

ముఖ్యంగా ఈ వేదికగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నాలాంటి వాళ్లు చిన్న హీరో అయినా చేస్తున్న పనిలో బిజీతో కొన్ని సందర్భాల్లో ఎవరికీ టైమ్‌ ఇవ్వలేము. కథలు వినలేము. తెలుగులో ఏ సినిమా హిట్‌ అయినా ఎక్కువశాతం ఆనందించేవాళ్లు ఉంటారు. ఏడ్చేవాళ్లు చాలా తక్కువ ఉంటారు. ఇటీవల నాపై కొన్ని మీమ్స్‌ వచ్చాయి. కథ చెబుతానంటే టైమ్‌ ఇవ్వలేదు.. వినలేదు అని. గంట సేపు ఓ మనిషిని కూర్చోబెట్టి తిరస్కరించడం ఇష్టం లేక నా నోటి నుంచి వచ్చిన జవాబు అది. చిన్న సినిమాగా మొదలైన ఆ చిత్రం పెద్ద హిట్‌ అయితే ఆనందించారు. డైరెక్టర్స్‌ గ్రూప్‌లో ఆ చిత్రం ట్రైలర్‌ రాగానే బావుందని మొదట స్పందించింది నేనే. ఆ చిత్రం నేను చేయాలి. కానీ కుదరలేదు. మన సినిమా బావుంటే తల ఎత్తుకునేలా ఉండాలి. మన సినిమా బావుందని ఎవరినో కించపరచవద్దు. అదొకటి నాకు బాధ అనిపించింది” అని అన్నారు.