రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంకు టాక్ ఎలా వచ్చినా కలెక్షన్స్ మాత్రం బాగా వస్తున్న నేపథ్యంలో సినిమా సక్సెస్ అంటూ అంతా అంటున్నారు. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 50 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమా తమ సినిమా కాన్సెప్ట్‌ను కాపీ కొట్టి తీశారు అంటూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ‘ఆనందం’ హీరో ఆకాష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆకాష్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి మెదడును మార్చే కాన్సెప్ట్‌తో తెలుగు మరియు తమిళంలో రాధా దర్శకత్వంలో ఒక సినిమాను చేశాను. తమిళంలో ఇప్పటికే ‘నాన్ యార్’ అనే టైటిల్‌తో విడుదల చేయడం జరిగింది. తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ అనే టైటిల్‌తో విడదలకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సమయంలోనే ఇస్మార్ట్ శంకర్ మాకు ఆశ్చర్యం కలిగించింది. సినిమా విడుదల అయిన వెంటనే తాము తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడంతో పాటు, ఇలా మీడియా ముందుకు వచ్చినట్లుగా ఆకాష్ చెప్పుకొచ్చాడు. పూరితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ఆకాష్ చెప్పాడు. కాని పూరి మాత్రం రెస్పాన్స్ అవ్వడం లేదన్నాడు.