పరశురామ్… ఈ తరం దర్శకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. వాటితోనే ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు పరశురామ్. ముఖ్యంగా రచయితగా గురువు పూరీనే మించిపోయే విధంగా పేరు తెచ్చుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఈ ఏడాది గీతగోవిందంతో సంచలనం సృష్టించాడు పరశురామ్. పదేళ్ల కింద యువత లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. హీరో నిఖిల్ కు సోలో హీరోగా ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. ఆ తర్వాత ఆంజనేయులుతో రవితేజలోని ఎనర్జీని అదిరిపోయేలా చూపించాడు. ఆంజనేయులు చిత్రంలో ఈయన రాసిన కామెడీ చమక్కులు ఇప్పటికీ పెదవులపై చిరునవ్వు తెప్పిస్తాయి.
ఇక సోలో సినిమాతో కుటుంబ ప్రేక్షకుల్ని కూడా తనదైన రీతిలో అలరించాడు పరశురామ్. నారా రోహిత్ కు హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసాడు. అందులో మాస్ ప్రేక్షకుల్ని అలరించే విధంగా కథను నడిపిస్తూనే.. కుటుంబ విలువలకు పెద్దపీట వేసాడు. ఇక రచయితగా ఆయన ఇమేజ్ ను మరింత ఎత్తుకు చేర్చింది సోలో. సారొచ్చారుతో రవితేజలోని మరో కోణాన్ని బయటికి తీసాడు. ఈ తరం దర్శకులు ఎవరూ పెద్దగా సాహసించని పెళ్లి, ప్రేమ కాన్సెప్ట్ ను తనదైన రీతిలో చెప్పాడు పరశురామ్. అల్లు శిరీష్ హీరోగా శ్రీరస్తు శుభమస్తుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో అల్లు శిరీష్ ను హీరోగా నిలబెట్టాడు. ముఖ్యంగా హీరో చెప్పిన డైలాగులు పరశురామ్ లోని రచయిత పవర్ ని తెలియజేశాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఏడాది వచ్చిన గీతగోవిందం మరో ఎత్తు. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూలు చేసింది. పరశురామ్ ను స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది. ఇప్పుడు ఈయన కోసం చాలా మంది యంగ్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లోనే వరసగా మూడో సినిమా చేయబోతున్నాడు పరశురామ్. ఈ బ్యానర్ లో వరసగా మూడు సినిమాలు చేస్తున్న తొలి దర్శకుడు పరశురామే కావడం విశేషం. అంత ఈజీగా ఎవరికీ మూడో అవకాశం ఇవ్వని అల్లు అరవింద్.. ఈ దర్శకుడి టాలెంట్ తెలిసి మరో ఆఫర్ ఇచ్చేసాడు. ప్రస్తుతం కథ సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు పరశురామ్. లీడింగ్ హీరోతో త్వరలోనే పెద్ద సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం గీతగోవిందం కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ.. పరుశురామ్ ఇలాగే వరస విజయాలతో దూసుకుపోవాలని ఆశిస్తూ.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం..