Site icon TeluguMirchi.com

ఆ మూడు సినిమాలు ఏమయ్యాయి?

gundello godari okkadine jaffaఇల్లు కట్టి చూడు… సినిమా తీసి చూడు – అనే మాట తెలుగు పరిశ్రమలో వినిపిస్తూనే వుంటుంది. కొబ్బరికాయ కొట్టిన దగ్గరి నుంచి… సినిమా తెర మీద చూసుకునే వరకూ ఎన్నో సుడి గుండాలు. సినిమా పూర్తి చేసినా… విడుదల చేయడం ఓ గగనంగా మారింది. కమల్ తీసిన ‘విశ్వ రూపం’ లా వివాదాస్పద అంశాల జోలికి వెళితే… ‘సినిమా ఆగిపోయింది’ అనడం లో కాస్త అర్ధం… మరి కాస్త క్రేజ్ వుంటుంది. సంసార పక్షంగా తీసిన సినిమాలకీ ఇలాంటి గండాలు ఎదురవ్వడం నిర్మాతల ఘోరమైన దుస్థితి కి అద్దం పడుతోంది. ‘క్లాప్’ కొట్టుకున్న ప్రతీ సినిమా… పూర్తి కాదు. పూర్తయిన ప్రతీ సినిమా విడుదలా కాకపోవచ్చు అనే పరిస్థితి నెలకొంది. తెలుగు సీమలో ప్రస్తుతం మూడు సినిమాలు ‘ఎప్పుడు విడుదల అవుదామా?’ అన్న నిరీక్షణ లో పడిపోయాయి. అవే ‘గుండెల్లో గోదారి’, ‘జఫ్ఫా’, ‘ఒక్కడినే’.

బ్రహ్మానందం దర్శకత్వంలో ‘జఫ్ఫా’ అనే విషయం బయటకు పొక్కగానే ‘జఫ్ఫా’ సినిమాపై టాలీవుడ్ దృష్టి కేంద్రీకరించింది. అయితే ‘ఆ సినిమాకి నేను దర్శకుడిని కాదు. కేవలం నటిస్తున్నానంతే’ అని బ్రహ్మీ చెప్పినా.. ఆ క్రేజ్ అలాగే కొనసాగింది. ఈలోగా ‘జఫ్ఫా’ దర్శకుడు వెన్నెల కిషోర్ ‘వెన్నెల వన్ అండ్ హాఫ్’ అనే కళాఖండం తీసినా సరే… ‘జఫ్ఫా’ కోసం జనాలు ఎదురు చూడడం మానలేదు. నిజానికి ‘జఫ్ఫా’కి మొదటి నిర్మాత బ్రహ్మానందమే. అయితే.. కొన్ని కారణాల వాళ్ళ ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే.. సినిమా
హక్కులని రమేష్ వర్మ కి మంచి లాభానికి అమ్మేశారు. ఆ మధ్య ‘జఫ్ఫా’ ట్రైలర్స్ హల్ చల్ చేశాయి. అయితే… కొన్ని రోజులుగా ఈ సినిమా ఊసే లేదు. ‘జఫ్ఫా’ ట్రైలర్ మాత్రమే బాగుందని…. సినిమాలో అంత సీన్ లేదనే మాట బయటకు రావడం తో.. ‘జఫ్ఫా’ జోలికి వెళ్ళడానికి పంపిణీదారులు జంకుతున్నారు. ఈ
సినిమా కి మోక్షం ప్రసాదించే వారెవరో చూడాలి.

‘గుండెల్లో గోదారి’ పరిస్థితీ అంతే. లక్ష్మీ ప్రసన్న ఈ సినిమాని నిర్మిస్తూ ఓ ప్రధాన పాత్ర పోషించింది. ఇళయరాజా స్వరాలూ సమకూర్చడం, అందులో కొన్ని పాటలు ‘బాగున్నాయి’ అనే టాక్ సంపాదించుకోవడంతో ఈ సినిమాకీ మంచి ప్రచారం లభించింది. అయితే.. ఈ సినిమా తొలి కాపీ వచ్చి 2 నెలలు కావస్తున్నా విడుదలకు నోచుకోలేదు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు, థియేటర్ లు దొరక్క పోవడం… పంపిణీ దారులు ఈ సినిమా కొనడానికి ఆసక్తి చూపించక పోవడం లాంటి సమస్యలతో విడుదలలో జాప్యం జరుగుతోంది. ‘త్వరలో… త్వరలో..’ అంటూ ఈ సినిమా ని వాయిదా వేసుకుంటూ వస్తోంది నిర్మాత కమ్ కధానాయిక… లక్ష్మీ ప్రసన్న.

మరో వైపు ఇలాంటి ఇబ్బందులే ‘ఒక్కడినే’ సినిమా కుడా ఎదుర్కొంటుంది. నారా రోహిత్, నిత్య మీనన్ జంటగా నటించిన ఈ సినిమా పాటలను 2 నెలల క్రితం విడుదల చేసారు. సినిమా బాగుంది అనే టాక్ సంపాదించినా… నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల వల్ల… విడుదల చేయలేక పోతున్నారు. నిర్మాతల ప్లానింగ్ లో లోపాలే… ఈ మూడు సినిమాలూ ఆగిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. చిన్న సినిమాలు.. అందులోనూ మంచి సినిమాలు ఆగిపోకూడదు. ఓ సినిమా ఆగిపోతే… నిర్మాతకే నష్టం. మంచి సినిమా చూడలేకపోతే ప్రేక్షకులూ నష్టపోయినట్టే. ఈ మూడు సినిమాలు ఆటంకాలను దాటుకుని త్వరలోనే మన ముందుకు రావాలని కోరుకుందాం.

Exit mobile version