ఈనెల 10న రావాల్సిన ఇద్దరమ్మాయిలు మే 31కి వాయిదా పడింది. బన్నీ సినిమాతో ఢీ కొట్టడం ఇష్టం లేక పవిత్ర, ప్రేమ కథా చిత్రమ్, ప్రేమ ఒక మైకం, ఇంటింటా అన్నమయ్య, జగద్గురు ఆదిశంకర.. ఇలాంటి సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. బన్నీ సినిమా వెళ్లిపోయాక తమ సినిమాని తీసుకొద్దామనుకొంటే… అది వచ్చే పరిస్థితిలో లేదు. వచ్చేస్తున్నాం… వచ్చేస్తున్నాం అని చిన్న సినిమాల్ని నిర్మాత బండ్ల గణేష్ భయపెడుతున్నాడు తప్ప… తన సినిమాని తీసుకురావడం లేదు. దానికి సవాలక్ష సమస్యలు. ముందు ఇద్దరమ్మాయిలకు ఐపీఎలే అడ్డు.. అన్నారంతా. ఆ తరవాత రీషూట్‌లు చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకి మరిన్ని నట్లు బిగిస్తున్నారట. లేటెస్టు టాక్ ఏమిటంటే ఈ సినిమాని అల్లు అరవింద్ ఇటీవలే చూశారట. కొన్ని మార్పులు కూడా చెప్పారట. దాంతో ఈనెలాఖరుకైనా ఈ సినిమా వస్తుందా? రాదా? అనే అనుమానం మరింత బలపడింది. ఒక్క హైదరాబాద్ సిటీలోనే ఏకంగా 80 థియేటర్లు ఈ సినిమా కోసం బ్లాక్ చేశారు. దాంతో చిన్న సినిమాలకు థియేటర్లు దొకరడం లేదు.
పెద్ద సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల కావడం అవసరమే. పెట్టిన డబ్బు తిరిగి రావాలంటే… ఆ మాత్రం థియేటర్లలో విడుదల చేసుకోవలసిందే. అందుకోసం థియేటర్లను బ్లాక్ చేసుకోవడం కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ విడుదల తేదీపై ఓ స్పష్టత లేకుండా… ఇలా చిన్న సినిమాలతో ఆడుకోవడం భావ్యం కాదు. విడుదల తేదీని మార్చుకొంటూ పోతే.. అసలు తమ సినిమాని తేవాలా? వద్దా?? అని చిన్న నిర్మాతలంతా గందరగోళంలో పడుతున్నారు. దానితో పాటు విలువైన వేసవి సీజన్ కూడా వృథాగా పోతోంది. దీనికి కారణం.. కేవలం పెద్దవాళ్ల అస్పష్ట వైఖరే! ఇక నుంచైనా ఈ చెడుగుడు వ్యవహారం కట్టిపెట్టాలి. లేదంటే మరిన్ని మంచి సీజన్లు వృథాగా పోవలసి వస్తుంది.