గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు మరియు శిరీష్ నిర్మిస్తున్నారు. కియారా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం యొక్క అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా, సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా..’ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. తెలుగు, తమిళంలో ‘రా మచ్చా మచ్చా..’ అంటూ, హిందీలో ‘ధమ్ తు దికాజా..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.
రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా తెరకెక్కిన ఈ పాట సెప్టెంబర్ 30న విడుదల కానుంది. శనివారం విడుదలైన ప్రోమో చూస్తుంటే, ఈ పాటను ఇండియన్ సినీ హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్టర్ శంకర్ తన ప్రత్యేక శైలిలో రూపొందించారనే విషయం స్పష్టమవుతుంది. ఎనర్జిటిక్, స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ ఆకట్టుకుంటున్నారు, మరియు ఆయన వేసిన హుక్ స్టెప్ ఒక్కసారి చూడగానే పులకించే విధంగా ఉంది. ఈ స్టెప్ నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవ్వడం ఖాయం. ఈ పాటలో 1000కి పైగా జానపద కళాకారులు రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేస్తుండడం విశేషం. అందులోనూ ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఈ పాటలో భాగంగా ఉంటున్నారు. ఈ పాటను శంకర్ వినూత్నంగా రూపొందించారు. గుసాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్లు వంటి ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యాల సరసన, వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒడిషాకు చెందిన గుమ్రా, రానప్ప, పైకా, దురువ వంటి వాటితో పాటు, కర్ణాటకకు చెందిన హలారీ, ఒక్కలిగ, గొరావర, కుణిత వంటి నృత్య శైలులను కూడా ఇందులో భాగం చేసారు.